Nizamabad News :  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.  ఇంకా సాధారణ ఎన్నికలకు 6 నెలల గడువు ఉండటంతో.. ఇప్పటి నుంచే బరిలోకి నిలవాలనుకుంటున్న అభ్యర్థులు చాప కింద నీరులా తమ పని చక్కబెట్టుకుంటున్నారు.  గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ గెలుపోందారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 8 అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే... కాంగ్రెస్ నుంచి ఒక్కరే జాజుల సురేంధర్ గెలిచి ఔరా అనిపించారు. ఆ తర్వాత జాజుల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టుంది. క్యాడర్ బలంగా ఉన్నారు. 


కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకున్న సుభాష్  రెడ్డి 


జాజుల సురేందర్ రెడ్డి  పార్టీ మారటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలు సుభాష్ రెడ్డి చూస్తున్నారు. అయితే ఇతర నేతలూ బలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.  ఈ నియోజకవర్గంలో హస్తం పార్లీలో ప్రస్తుతం ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూధన్ రావు... ఈ సారి ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మధుసూధన్ రావు పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇది మింగుడు పడక మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సుభాష్ రెడ్డి ఇతర కాంగ్రెస్ లీడర్లు మదుసూధన్ రావు  వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. 


మదన్ మోహన్ రావు జోక్యంతో కాంగ్రెస్‌లో కల్లోలం


మదన్ మోహన్ రావు పై గతంలో పీసీసీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఓవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కొడుకును ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఒక్క నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీలోనే ముగ్గురు నాయకులు టికెక్ తమకంటే తమకే ఇవ్వాలంటూ అటు అధిష్టానంపై కూడా ఒత్తిడి తీసుకోస్తున్నట్లు సమాచారం. సుభాష్ రెడ్డి రేవంత్ వర్గంగా ముద్రపడింది. ఎలాగైనా టికెట్ తనకే లభిస్తుందన్న ధీమాలో ఆయన ఉన్నారు. మరోవైపు మధుసూధన్ రావు గత ఎంపీ ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారాయన. ఇటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ తన సీనియారిటీ ఉపయోగించి కొడుక్కు ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూపులుగా ఏర్పడి నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ లో ట్రయాంగిల్ వార్ కొనసాగుతోంది. 


బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ 


బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జాజుల బీఆర్ ఎస్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.  గతంలో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఏనుగు రవీంధర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ లో ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో బాణాల లక్ష్మారెడ్డి, ఏనుగు రవీందర్   రెడ్డి ఉన్నారు. బాణాల లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో  బీజేపీ తరపున జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఆయన ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈటెల రాజేందర్ తో బీజేపీలోకి వెళ్లిన ఏనుగు తనకే టికెట్ కావాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. 


పార్టీ మారి అయినా  పోటీ చేసే ఉద్దేశంలో నేతలు 


ఒక వేళ ఏనుగు రవీందర్ రెడ్డికి బీజేపీలో టికెట్ ఇవ్వకుంటే బీఆర్ఎస్ లో చేరి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకూ వెనకాడరంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు మధుసూధన్ రావుకు కూడా ఒక వేళ కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకుంటే బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సైతం స్కెచ్ వేస్తున్నట్లు ఎల్లారెడ్డి నియోజకవర్గం పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో అభ్యర్థులు ఎవరన్నదానిపై జోరుగా చర్చ మొదలైంది. ఇటు ఆయా పార్టీల క్యాడర్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రధాన పార్టీలు సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.