నిజామాబాద్ జిల్లా రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయ్. అప్పుడే జిల్లా పాలిటిక్స్‌లో ఎన్నికల హాడావుడి మొదలైందా అన్నట్లుంది పార్టీల వ్యవహారం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయ్. ప్రెస్ మీట్లు, కార్యక్రమాలతో నాయకులు బీజీబీజీగా గడుపుతున్నారు.
ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో ఉందని చెప్పాలి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ను టార్గెట్ చేసింది టీఆర్ఎస్. పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన్ని తిరగనివ్వకుండా అడుగడుగునా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ కవిత తన క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఎంపీ అరవింద్‌పై ఫైర్ అయ్యారు. హామీలు గాలికి వదిలేసిన ఆయన్ని జిల్లాలో తిరగనివ్వోమంటూ సూటిగా చెప్పేశారు. దీంతో అరవింద్ తన పార్లమెంట్ పరిధిలో పర్యటనలకు వెళ్తుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు.
ఎంపీ అరవింద్ బాల్కొండ నియోజకవర్గంలోని కుకునూర్ గ్రామాన్ని దత్త తీసుకున్నారు. ఈ గ్రామంలో పర్యటించేందుకు వెళ్తున్న అరవింద్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు భారీగా గుమిగూడారు. అప్పటికే నిజామాబాద్ సీపీ నాగరాజుకు సైతం ఫోన్‌లో ఎంపీ అరవింద్ సమాచారం ఇచ్చారు. ఇటు పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని అరవింద్ అరోపించారు.
నిజామాబాద్ నగరంలోని సీపీ క్యాంప్ కార్యాలయం ఎదుట 2 గంటలకుపైగా అరవింద్ నిరసన తెలిపారు. గతంలోనూ ఆర్మూర్ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గంలో అరవింద్ పర్యటనలను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులపై దాడులు చేశారు. ఇలా అరవింద్ పర్యటనపై టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటుండటంతో జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయ్.
ఎంపీ అరవింద్‌తోపాటు ఆయన వర్గీయులు కూదా టీఆర్‌ఎస్ లీడర్లకు అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు. ఆర్మూర్‌లో ఎంపీ అరవింద్ ఇంటి ఎదుట పసుపు రైతులమంటూ పసుపు కొమ్ములను వేసి ధర్నా చేశారు. పసుపు బోర్డు తేవాలంటూ నిరసన చేశారు. ఇది టీఆర్ఎస్ నాయకుల పనే అంటూ అరవింద్ ఆరోపించారు. దానికి రియాక్షన్ అన్నట్టుగానే బీజేపీ సైతం ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలంటూ నిరసనలు చేపట్టింది. అటు బోదన్‌లో షకీల్ ఇంటి ఎదుట, ఇటు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంటి ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు.
ఇలా పోటాపోటీ కార్యక్రమాలతో నిజామాబాద్ జిల్లాలో పోలిటికల్ వార్ కొనసాగుతోంది. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లు కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంపీ అరవింద్ సైతం ప్రెస్ మీట్లు పెడుతూ టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా.... అప్పుడే జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయ్. బీజేపీ, టీఆర్ఎస్‌లు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ... ముందుకెళ్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల మధ్య జిల్లాలో పోలిటికల్ వారా్ నడుస్తోంది.