Police Vehicle Checkings: ప్రాణహిత పరివాహక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియా డామినేషన్, ఫెర్రి పాయింట్స్ వద్ద పోలీసులతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మంచిర్యాల ఇంఛార్జీ డీసీపీ అఖిల్ మహాజన్, జైపూర్ ఏసీపీ నరేందర్ ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ నరేష్, ఎస్ఐ వెంకట్ లు రామగుండం కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, జైపూర్ సబ్ డివిజన్, చెన్నూర్ రూరల్ సర్కిల్, కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషను పరిదిలోనీ ఫెర్రి పాయింట్స్ వద్ద ప్రతీ వాహనాన్ని ఆపుతూ చెక్ చేస్తున్నారు. 


అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా..
ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని గ్రామాలతో పాటు మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని ఫెర్రీ పాయింట్స్ ని సందర్శించి, ఆ దారిలోని కల్వర్టులను తనిఖీ చేస్తున్నాడు. అలాగే పడవలు నడిపే వారితొ మాట్లాడి సమాచారం తెలుసుకోవడం, చేపలు పట్టే మత్స్యకారుల ముచ్చటిస్తూ.. అక్కడి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఎవరూ మావోయిస్టులకు ఆశ్రయం కల్పించి, సాయం చేసి అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని చెబుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. మావోల అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగానే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గతంలో మావోయిస్టు పార్టీలో పని చేసిన వారి వివరాలు కూడా సేకరించి వారిపై నిఘా పెంచారు. 




అంతర్రాష్ట్ర బ్రిడ్జి మీదుగా రాకపోకలను సాగిస్తున్న ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను నిలిపి వేసి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వెళ్లనిస్తున్నారు. ఈ తనిఖీల్లో కోటపల్లి ఎస్ఐ వెంకట్, ఎస్ఐ నీల్వాయి నరేష్, స్పెషల్ పార్టీ మరియు టీఎస్ ఎస్పీ ఫోర్స్ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది 50 మంది పాల్గొన్నారు.


మొన్నటికి మొన్న కైలాశ్ టేకిడి అటవీ ప్రాంతంలో..! 
ఆదిలాబాద్ అడవుల్లో అన్నల అలజడి మొదలయింది. కైలాష్ టేకిడి అటవి ప్రాంతంలో మావోలు సంచరించారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో ఉదయం నుండి అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్‌ లో మావోలకు సంబంధించిన ఓ గ్రెనేడ్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో మరింత ముమ్మరంగా ఆదిలాబాద్ జిల్లాలో మావోల కోసం పోలీసుల వేట కోనసాగిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కీలకమైన అగ్రనాయకులు ప్రభాత్, భాస్కర్, వర్గీస్, రాము, అనిత సంచరిస్తున్నారని పోలీసులు కూంబింగ్ అపరేషన్ కొనసాగిస్తున్నారు. బోథ్ మండలంలోని కైలాష్ టేకిడి అటవి ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ జరుగుతోంది. ఈ కూంబింగ్ లో మావోలకు సంబంధించిన ఓ గ్రేనేడ్ దొరగ్గా.. ఆ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు‌. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కాని మావోల కోసం భారీగా బలగాలతో కూంబింగ్ మాత్రం జరుపుతున్నారు. దీంతో స్థానికులు అందోళన చెందుతున్నారు.


ఇప్పటికే నిఘా వర్గాల సమాచారంతో కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలు మావోయిస్టుల పోస్టర్లను విడుదల చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.