TPCC Working President Mahesh Kumar Goud: 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ చెప్పిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 8 సంవత్సరాలుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ చేయలేదని.. దళితున్ని సీఎం చేయలేదు, దళితులకు మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇంటికొక ఉద్యోగం ఇవ్వకుండా మాట మార్చారు. 24 గంటల కరెంటు సక్రమంగా ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా కేసీఆర్ మార్చడన్ని ప్రజలు స్వాగతించరని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ (TRS Is Now BRS) గా మార్చుకోవాలని అన్నారు మహేష్.
మిగులు బడ్జెట్ ను అప్పుల రాష్ట్రం చేశారు
మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో అప్పుల పాలు చేసిన కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే బంగారు కుటుంబాలుగా ఎదిగారని అన్నారు. తెలంగాణలో సామాన్య కుటుంబాలు అలాగే ఉన్నాయని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో మద్యం ఏరులై పారే విధంగా చేసింది కేసీఆర్ అని, మద్యం షాపుల ముందు 12 ఏళ్ల పిల్లలు నిలబడే విధంగా తెలంగాణ సంస్కృతిని దిగజార్చిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు. టీఆర్ఎస్ అనేది బీజేపీ పార్టీకి బీ టీం అని టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో ఉన్న ఒప్పందాల కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని ఆరోపించారు మహేష్ కుమార్. తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్వార్థం కోసం తన కుటుంబ స్వార్థం కోసమే బీఆర్ఎస్ (National Party BRS) ను ఏర్పాటు చేశారని, తెలంగాణలో అప్రజాస్వామికంగా, నిరంకుశ పాలన చేస్తూ, ప్రజలు ధర్నాలు చేసుకోవడానికి వీలు లేకుండా ధర్నా చౌక్ ను కేసీఆర్ ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ దే విజయం
వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగ యువత, 24 గంటల కరెంటు పేరుతో మోసపోయిన రైతాంగం, పండించిన పంటకు గిట్టుబాటు రాని రైతాంగం బి ఆర్ ఎస్ పార్టీకి గుణపాఠం చెప్తారని, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి, భూకబ్జాలు పెరిగిపోయాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో కులం పేరుతో దేశాన్ని విభజిస్తుంటే కులాలకు, మతాలకు అతీతంగా దేశాన్ని ఒకటి చేయాలని రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ప్రజలను ఏకం చేస్తుందని, వచ్చే ఎన్నికలలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.