నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయ్. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా నాయకులను పార్టీల కండువా కప్పేస్తున్నారు. టీఆరెస్ పార్టీ బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తుంటే... బీజేపీ అధికార పార్టీ నాయకులను ఆహ్వానిస్తోంది. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ, బీజేపీ రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ లో ముందుంటున్నాయ్. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులను టార్గెట్ చేసింది.
నిజామాబాద్ నగరంలోని 33వ డివిజన్ బీజేపీ కార్పోరేటర్ మల్లేష్ గౌడ్ ఎమ్మెల్సీ కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ మరుసటి రోజే బీజేపీ సైతం టీఆర్ఎస్ నాయకుడు మోహన్ రెడ్డికి అధికార పార్టీకి రాజీనామా చేయించిందని తెలుస్తోంది. బోధన్ నియోజకవర్గ నాయకుడిగా మోహన్ రెడ్డికి మంచిపట్టుంది. అయితే మోహన్ రెడ్డి బాహటంగానే బీజేపీ పార్టీలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి 28 మంది కార్పోరేటర్లు విజయం సాధించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీజేపికి చెందిన 10 మంది కార్పోరేటర్లను ఇప్పటికే లాగేసుకుంది. అన్ని నియోజవకర్గాల్లోనూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపరేషన్ ఆకర్షన్ ఉద్ధృతం చేశారు. ఆర్మూర్ 3 నెలల కింద టీఆర్ఎస్‌కు చెందిన కొంత మంది కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పార్టీలకు చెందిన చాలా మంది సెకండ్ క్యాడర్ నాయకులను కారు పార్టీలోకి చేర్చుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ మొదట్నుంచి ఇతర పార్టీల నాయకులను భారీగా ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం కార్పోరేటర్లపై గులాబీ పార్టీ గురి పెట్టింది. బీజేపీకి చెందిన కార్పోరేటర్లను ఒక్కొక్కరిని టీఆర్ఎస్ నాయకులు కారెక్కిస్తున్నారు. దీంతో జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూగా మారింది. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయ్. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతున్నారనేది తెలియటం లేదు. సడన్‌గా పార్టీలు మార్చేస్తున్నారు నాయకులు.
ఆపరేషన్ ఆకర్ష్‌పై టీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్ పెట్టడంతో బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు పార్టీలోకి టీఆర్ఎస్ నాయకులను ఆహ్వానిస్తోంది. బీజేపీ సైతం టీఆర్ఎస్‌లో ఉన్న కీలక నేతలపై కన్నేసింది. ఉద్యమంలో పోరాడిన నాయకులను, టీఆర్ఎస్ పార్టీలో పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న లీడర్స్‌ను బీజేపీ ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో ఈ చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయని ఇరు పార్టీల నేతలు బాహటంగానే చెప్పుకుంటున్నారు.
అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కూడా పార్టీలని మరింత బలోపేతం చేసేందుకు కీలక సమాజిక వర్గాలపై దృష్టి పెట్టారు. మరింత బలోపేతం చేసేందుకు కీలక సామాజిక వర్గం నాయకులపై కన్నేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ రెండు పార్టీల నాయకులు మాత్రం గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇటు బీజేపీ బలం లేని నియోజకవర్గాల్లో పేరున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. టీఆర్ఎస్‌లో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదేమో అనుకునే నేతలు బీజేపీ నాయకులతో టచ్‌లో ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ లో బిజీ అయ్యారని తెలుస్తోంది.