గతేడాదితో పోల్చితే ఈ ఏడాది క్రైం రేట్ పెరిగిందని నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. 2022 ఏడాదికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఇయర్ ఎండ్ రిపోర్ట్ ను సీపీ నాగరాజు మీడియా సమావేశంలో విడుదల చేశారు. గతేడాది ఈ కేసుల సంఖ్య 826 కాగా, ఈ ఏడాది 985 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  అంటే గతేడాదితో పోలిస్తే 159 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆస్తి తగాదాలు, ఇతర దొంగతనాలు ఇలా నేరాలకు సంబంధించి ఈ ఏడాది 1022 కేసులు నమోదయ్యాయి. 2021లో వీటి సంఖ్య 676 గా ఉంది. ఈ ఏడాది 346 కేసులు పెరిగాయి. ఇందులో ఎక్కువగా వాహనాల చోరీ కేసులే 417 నమోదయ్యాయి. 2022లో జిల్లా వ్యాప్తంగా దొంగిలించిన సొత్తు విలువ 6 కోట్ల 75 లక్షల 54 వేల 285 రూపాయలు (రూ.6.75 కోట్లు) కాగా ఇందులో రికవరీ చేసింది 2 కోట్ల 22 లక్షల 897 రూపాయలని (రూ. 2.22 కోట్లు) సీపీ నాగరాజు తెలిపారు. చోరీ అయిన సొత్తులో 32.86 శాతం మాత్రమే రికవరీ చేశారు. 


సంచలనంగా మారిన బ్యాంక్ చోరీ 
ప్రధానంగా బుస్సాపూర్ బ్యాంక్ లో చోరీ సంచలనం అయ్యింది. జిల్లాలో ఇది పెద్ద చోరీ. బ్యాంకు నుంచి నగదు, బంగారు నగలు మొత్తం 4 కోట్ల 46 లక్షల రూపాయల సొత్తు చోరీకి గురైంది. ఈ బ్యాంక్ రాబరీకి పాల్పడిన వారు మొత్తం యూపీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8,50,000 మాత్రమే రికవరీ చేశారు. ఇందులో 30 కేజీల బంగారం చోరీకి గురైంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు కేవలం 18 తులాల బంగారం మాత్రమే రికవరీ చేశారు. చోరీ జరిగి 6 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో దొంగలను అరెస్ట్ చేయలేకపోయారు పోలీసులు. యూపీ పోలీసులు వీరికి సహకరించటమే అందుకు కారణమని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు దొంగలను పట్టుకున్న పోలీసులు మిగతా వారి విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్న దానిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, 320 మంది మృతి
2022లో రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 320 మంది చనిపోయినట్లు, 291 కేసులు నమోదైనట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈ ఏడాదిలో వరకట్నంపు హత్యలు 4, వరకట్న వేధింపుల కింద నమోదైన కేసులు 340, ఇతర వేధింపులు 166, ఈవ్ టీజింగ్ కింద 40 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య 388 గా ఉంది. ఈ ఏడాది మహిళలపైన దాడులు గతేడాదితో పోలిస్తే 41.75 శాతం పెరిగిందన్నారు సీపీ నాగరాజు.


ప్రత్యేక, స్థానిక చట్టాల కింద ఈ ఏడాది 485 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య 460 గా ఉంది. ఈ చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఈ ఏడాది మొత్తం 3,88,374 కేసులు నమోదవగా... 12 కోట్ల 30 లక్షల 95 వేల 500 రూపాయలు జరిమానా విధించింది జిల్లా పోలీస్ శాఖ. గతేడాదితో పోలిస్తే ఈ చలాన్లలో 16.46 శాతం తగ్గింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గతేడాదితో పోలిస్తే 176.47 శాతం కేసులు పెరిగాయి. ఇక జూదం ఆడుతూ దొరికిన వారిపై మొత్తం 384 కేసులు నమోదు కాగా, మట్కా అడిన వారిపై 47 కేసులు నమోదయ్యాయి. మొత్తం రూ. 56,55,477 నగదును జూదం అడుతూ పట్టుకున్నారు. మట్కా అడగా రూ. 4,92,646 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్కా అక్రమ రవాణాలో ఈ ఏడాది 38 కేసులు నమోదు కాగా రూ. 87,99,138 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అక్రమ రవాణా కింద ఈ ఏడాది 19 కేసులు నమోదయ్యాయి. 272.761 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై 60 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలీస్తే ఈ కేసులు 18.91 శాతం తగ్గిందని తెలిపారు సీపీ నాగరాజు. 


లోక్ అదాలత్ కింద ఈ ఏడాది 19,110 కేసులు పరిష్కారమయ్యాయ్. జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కింద 114 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 64గా ఉంది. 78.12 శాతం కేసులు పెరిగాయి. ఈ ఏడాది మిస్సింగ్ కేసులు 684 నమోదయ్యాయి. ఇందులో 547 కేసులు విజయంతంగా ఛేదించగా, ఇంకా 137 కేసుల ట్రేస్ కాలేదని తెలిపారు సిపి నాగరాజు. గతేడాదితో పోలిస్తే ఈ కేసులు 6.37 శాతం మిస్సింగ్ కేసులు పెరిగాయ్. 18 ఏళ్లలోపు తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఈ ఏడాది 56 ఉంటే 52 మంది ఆచూకీని పోలీసులు గుర్తించగా ఇంకా ఇద్దరు చిన్నారుల ఆచూకీ తెలియలేదు. ఆపరేషన్ ముస్కాన్ కింద ఈ ఏడాది జిల్లాలో 38 మందిని పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గతేడాది 155 మంది చిన్నారులను గుర్తించి 153 మందిని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఏడాది డయల్ 100 కింద 53,376 కాల్స్ వచ్చినట్లు కమిషనర్ నాగరాజు తెలిపారు. 


 అయితే జిల్లాలో ప్రధానంగా మెండోరా మండలం బుస్సాపూర్ ఎస్బీఐ బ్యాంక్ లో చోరీ కలకలం సృష్టించింది. భారీగా నగదు, బంగారం అపరహణకు గురైంది. ఈ కేసులు పోలీసులు చోరీ అయిన సొత్తును రికవరీ చేసింది చాలా తక్కువే. ఇంకా నిందితులను పట్టుకునే పనిలో కొన్ని పోలీస్ బృందాలు ఉన్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్ గా చూస్తే క్రైం సంఖ్య జిల్లాలో పెరిగిందనే చెప్పవచ్చు.