తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం లేని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ సంపదతో తెలంగాణకు స్వాతంత్ర్యం తామే తెచ్చినట్టు వజ్రోత్సవాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.  తెలంగాణ విలీన పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని, నెహ్రూ నాయకత్వంలో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ కు వచ్చి భారతదేశంలో విలీనం చేశారని అన్నారు. ఆఖరి నిజాం రాజు సెక్యులర్ తత్వంతో ఉన్నాడని, దక్షిణ భారతదేశానికి మొట్టమొదటిగా కరెంటు తెచ్చిన వ్యక్తి  అన్నారు. బీజేపీ  హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. 8 సంవత్సరాలుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి ఎందుకు ఇన్ని రోజులు తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించలేదని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో ఇప్పుడు తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 


చివరి నిజాం రాజు రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం ఉంచితే సీఎం కేసీఆర్ ఆ భూములను తన అనుచరులకు పంచిపెడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఒక్కొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే వజ్రోత్సవాల పేరుతో దాదాపు రూ. 35 లక్షలు ఖర్చు పెట్టారని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.  అంబేడ్కర్ ఆశయాలను 75 సంవత్సరాలుగా ప్రజలలోకి తీసుకువెళ్లిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టగానే దళితులకు మంచి చేసినట్టు కాదని, కేసీఆర్ దళితులకు మోసం చేశారని మండిపడ్డారు. దళితులను సీఎం చేస్తానని చేయలేదన్నారు.  మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కట్టలేదని ఆరోపించారు. దళిత బంధుకు లక్షల్లో అప్లికేషన్లు వస్తే వేలల్లో కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులపైన, గిరిజనులపై మైనారిటీలపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు ప్రేమలేదన్నారు. కేవలం ఎన్నికల కోసమే నటిస్తున్నారని దీనిని ప్రజలు గమనించాలని  అన్నారు.



"కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆస్తులను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నాడని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను అని చెప్పి మోసం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రాజెక్టులన్నింటినీ తన అనుచరులకు ఇస్తున్నారు. భూములను అమ్మేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే. అమిత్ షాకు, కేసీఆర్ కు చీకటి ఒప్పందాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎనిమిది సంవత్సరాలుగా చెబుతున్న బీజేపీ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతిలో రాష్ట్ర బీజేపీ నాయకుల వాటా ఎంత?  కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని అబద్ధపు ప్రచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రైతులకు నష్టం  జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తుందని, ఆచరణలో సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు.  కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పదని సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలకు త్వరలోనే తెర తొలగిపోతుంది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 మంది శాసనసభ్యులు, ఇద్దరు ఎంపీలు ఉండి ఇప్పటివరకు జిల్లాలో ఒక్క ఫ్యాక్టరీని కూడా నిర్మించలేదు. కొత్త ప్రాజెక్టులు గాని, కాలేజీలు గాని కట్టలేదు. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేదు. టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనబడుతుంది" అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.