నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి గాంధీ ఆస్పత్రి రికార్డును బ్రేక్ చేసింది. ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన వైద్యాన్ని ఎలాంటి ఫీజులు లేకుండా ఆర్థిక స్తోమత లేని రోగులకు ఊరట కల్పిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేసుకోలేని వారికి ఇప్పుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వరంగా మారింది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రల్లా కామన్‌గా కాకుండా ప్రత్యేకతను చాటుతోంది నిజామాబాద్ సర్కార్ దవాఖాన.


అరుదైన శస్త్ర చికిత్సలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారుతోంది నిజామబాద్‌ ప్రభుత్వాసుపత్రి. ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉంచితంగా అందిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహాలో రోగులకు వైద్యసేవలు అందుతున్నాయి. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తీసిపోని వైద్యం అందిస్తున్నారు.


కార్పొరేట్లో మోకాలి చిప్పలు రిప్లేస్‌మెంట్ ఆపరేషన్‌కు దాదాపు 3 నుంచి 4లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం ఉచితంగా చేయడంతోపాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఫిజియోథెరపిస్టుతో వ్యాయామం నేర్పిస్తున్నారు. డాక్టర్ నాగేశ్వర్ రావు నేతృత్వంలోని వైద్య బృందం మూడు నెలల్లో 60 మందికి మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేశారు. 


గతంలో గాంధీ ఆసుపత్రిలో 24 గంటల్లో 9 మందికి మోకీలు రిప్లేస్‌మెంట్స్‌ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 10 మందికి మోకాలి చిప్పలు ఆపరేషన్లు చేసి గాంధీ ఆస్పత్రి రికార్డును తిరగరాసింది. మోకాలి చిప్పల రిప్లేస్‌మెంట్ చేసుకొనేవారికి ప్రత్యేక హస్పిటల్‌లో ప్రత్యేక వార్డు, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు. వైద్యులు అందిస్తున్న చికిత్స పట్ల రోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


తెలంగాణలోనే నీ రిప్లేస్ మెంట్ లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిజామాబాద్ సర్కార్ దవాఖాన అరుదైన రికార్డు సొంతం చేసుకుని పేదలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన వైద్యాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తూ... శభాష్ అనిపించుకుంటోంది. వైద్యశాఖ మంత్రి హరీష్ రావు పేదలకు మంచి వైద్యం అందేలా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయ్.