నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవలే ఓ ఫ్యామిలీ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరంతా ఆదిలాబాద్ జిల్లా వాసులుగా తెలుస్తోంది. మృతులు సూర్య ప్రకాష్, అక్షయ, ప్రత్యుష, అద్వైత్ గా పోలీసులు గుర్తించారు. అయితే మృతులందరూ గత పదిహేను రోజుల నుంచి పట్టణంలోని కపిలహోటల్‌లోనే ఉంటున్నారు. గత 40 ఏళ్ల క్రితం నిజామాబాద్‌కు చెందిన సూర్య ప్రకాశ్ కుటుంబం బతుకుదెరువు కోసం ఆదిలాబాద్ వెళ్లింది. అక్కడే హార్డ్ వేర్ షాపు, పెట్రోల్ బంక్ వ్యాపారం పెట్టుకొని హాయిగా జీవిస్తున్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం సూర్య ప్రకాష్.. హైదరాబాద్ కు మకాం మార్చాడు. ఆదిలాబాద్ లో ఉన్న వ్యాపారలన్నింటిని అమ్మేసి భాగ్యనగరంలో నలుగురు భాగస్వాములతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టాడు. ఏడేళ్లపాటు బాగానే సాగింది వీళ్ల వ్యాపారం. కానీ ఈ మధ్యే వ్యాపారంలో కలహాలు మొదలయ్యాయి. 


వ్యాపార భాగస్వాములు ఇంటికెళ్లి దాడి చేశారా..!


వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చాయి. అవి కాస్తా గొడవలకు దారి తీశాయి. ఈ క్రమంలోనే సూర్య ప్రకాశ్ పార్టనర్స్ పలుమార్లు ఇంటికి వచ్చి దాడి చేశారు. దీంతో భయపడిపోయిన సూర్య ప్రకాష్ తన కుటుంబాన్ని తీసుకొని హదిహేను రోజుల క్రితం నిజామాబాద్ చేరుకున్నాడు. అక్కడే ఓ హోటల్‌లో రూం బుక్ చేసుకొని ఉంటున్నారు. అక్కడే శనివారం ఉదయం నలుగురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భార్యా, పిల్లలకు కేక్ లో విషం పెట్టి తినిపించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అతడు కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే శనివారం రోజు హోటల్ సిబ్బంది వచ్చి డోర్ కొట్టినా ఎంతకూ తెరవలేదు. పడుకున్నారేమో అనుకొని వాళ్లు కూడా వదిలేశారు. 


చనిపోయిన వారిని చక్కగా పడుకోబెట్టి..!


కానీ మరుసటి రోజు ఉదయం కూడా వాళ్లు డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు తెరిచి చూసే సరికి సూర్య ప్రకాష్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. ఆయన భార్య, పిల్లలు బెడ్ పై అచేతనంగా పడి ఉన్నారు. ముందుగా భార్యా పిల్లలే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకు కారణాలు.. పిల్లల ముక్కులోంచి రక్తం రాకుండా ఉండేందుకు దూది పెట్టడం, వారిని చక్కగా బెడ్ పై పడుకోబెట్టడం, భార్యకు దుప్పటి కప్పడం. ఇవన్నీ గుర్తించిన పోలీసులు అక్కడే ఓ సూసైడ్ నోట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని వారి ఆత్మహత్యకు కారణం ఎవరో తెలుసుకున్నారు. 


నిందితులను కఠినగా శిక్షించాల్సిందే..!


అయితే సూర్య ప్రకాశ్ సూసైడ్ నోట్ లో తన వ్యాపార భాగస్వాములు కిరణ్ కుమార్, వెంటక్ వల్లే చనిపోతున్నట్టు వివరించారు. మరో ఇద్దరి పేర్లను కూడా సూసైడ్ నోట్ లో రాసినట్లు సమాచారం. తన ఇంటిపైకి వచ్చి దాడి చేయడంతో భయపడి నిజామాబాద్ వచ్చినట్లు అందులో వివరించాడు. అయితే నలుగురి చావుకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య ప్రకాష్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.