Nizamabad Manchippa Project: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామ శివారులో నిర్మిస్తున్న మంచిప్ప రిజర్వాయర్ రగడ మళ్లీ మొదలైంది. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ముంపు గ్రామాల ప్రజలు మళ్లీ ఉద్యమానికి సై అంటున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కింద 21, 22 ప్యాకేజిలో పనులు జరుగుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని ఎత్తిపోస్తూ.... ప్యాకేజి పనులు నడుస్తున్నాయి. 22 ప్యాకేజి మంచిప్ప ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో మంచిప్ప ప్రాజెక్ట్ 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మంచిప్ప ప్రాజెక్ట్ కెపాసిటీని 3.5 టీఎంసీలకు పెంచుతూ... రీ- డిజైన్ చేశారు. రీడిజైన్ వల్ల మంచిప్ప గ్రామంలోపాటు మరో 2 గ్రామాలు, 9 తండాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో వ్యవసాయ భూములు సైతం ముంపులోకి వెళ్తాయని ముంపు ప్రాంతాల రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. 




గతేడాది కూడా ముంపు గ్రామాల ప్రజలు ఇలాగే ఆందోళనలు చేశారు. ప్రాజెక్ట్ పనులను ముంపు ప్రాంత రైతులు అడ్డుకున్నారు. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుంది. దీంతో పాత డిజైన్ లొనే పనులు చేస్తామని అధికారు ప్రకటించడంతో.. ముంపు ప్రాంత రైతులు కాస్త శాంతించి ఆందోళనలు విరమించారు. తిరిగి తమకు తెలియకుండానే... పాత డిజైన్ లో కాకుండా రీ డిజైన్ తోనే పనులు జరుగుతున్నాయని ముంపు గ్రామాల ప్రజలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. మంచిప్ప ప్రాజెక్ట్  పరిధిలోని కొండెం చెరువు వద్ద ముంపు గ్రామాల ప్రజలు వంట వార్పు చేపట్టారు. మంచిప్ప గ్రామం నుంచి పెద్ద ఎత్తున కొండెం ప్రాజెక్ట్ కు వెళ్తున్న ముంపు ప్రాంత వాసులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా  కుటుంబ సభ్యులతో వెళ్లి కొండెం చెరువు వద్ద వంటా వార్పు చేస్తున్నారు ముంపు గ్రామాల ప్రజలు. రీ డిజైన్ రద్దు చేసే వరకు ఇక్కడ పనుల జరగానివ్వం అని టెంట్ ఏర్పాటు చేసుకొని  బైఠాయించారు. 




రీ డిజైన్ 3.5 టీఎంసీ ప్రాజెక్టును అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. పనులు ఆపటంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ... బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటు వెయ్యొద్దని ప్రచారం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము అడ్డుపడట్లేదని... పాత డిజైన్ తోనే నిర్మించాలని మాత్రమే కోరుతున్నట్లు వివరించారు. రీ- డిజైన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రీ- డిజైన్ రద్దు చేస్తే 3 గ్రామాలు, 9 తండాల ప్రజలు బీఆర్ఎస్ కి ఓట్లు వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు డీపీఆర్ ప్రవేశ పెట్టలేదని... దొంగ చాటుగా రీ డిజైన్ పనులు చేపడుతున్నారని ఫైర్ అయ్యారు. తమ బతుకులతో ఆటలాడుతున్నారని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీ డిజైన్ ను ప్రభుత్వం అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తేనే పనులు జరగనిస్తామని.. లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ముంపు గ్రామాల ప్రజలు.