Nizamabad District: నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా వేరే వాళ్లకు సీట్లు కేటాయిస్తున్నారంటూ కొందరు నేతలు మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు కూడా ఇష్టారీతిలో ఇంఛార్జిలను నియమిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు అవలంభిస్తున్నారంటూ వివిధ మండలాలకు చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.


నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో పదవులను ఎంపీ అరవింద్ అనుచరులకు ఇప్పించుకుంటూ సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు అరవింద్ తీరును నిరసిస్తూ కార్యాలయంలో బైఠాయించారు. బోధన్, ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నేతలు ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం. బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానున్న తరుణంలో ఇంఛార్జీల నియామకం ఇష్టా రీతిన చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇష్టారీతిన అసెంబ్లీ ఇంఛార్జీల నియామకం అంటూ ఫైర్...


పార్టీలో సీనియర్లను కాదని అసెంబ్లీ కన్వీనర్లను అరవింద్ అనుచరులకే ఇప్పించుకున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ను తొలగించాలని నినాదాలు చేసినట్లు సమాచారం. పార్టీ నుంచి కార్పొరేటర్లు ఇతర పార్టీలకు వెళ్లిపోతున్నా పట్టించుకోవటం లేదు. పార్టీ వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎంపీ అరవింద్ వన్ సైడ్ గా పోతున్నారంటూ ఓ వర్గం ఆరోపిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పదవుల కేటాయింపుపై బీజేపీలో చిచ్చు రాజుకుంది. ఇక బండి సంజయ్ పాదయాత్రలో ఈ ఎఫెక్ట్ పడనుండేమో అని పార్టీ నాయకులు అనుకుంటున్నట్లు తెలుస్తోoది.


త్వరలో జిల్లా అధ్యక్షుడి మార్పు..



జిల్లా బీజేపీలో వర్గ విభేధాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఓ వైపు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీ 28 మంది కార్పోరేటర్లను గెలుచుకుంది. గతంలో ఎప్పుడూ ఈ సంఖ్య ఆ పార్టీకి రాలేదు. అయితే జిల్లా నేతల మధ్య సఖ్యత కొరవడటంతో ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరిపోయారు. మరికొంత మంది కార్పొరేటర్లు కూడా పార్టీ వీడుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ అర్వింద్ కు మొదట్నుంచి అండగా ఉంటూ వస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినారాయణ సైతం ప్రస్తుతం యెండల పంచన చేరారన్న ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలో బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. మరోసారి బస్వ లక్ష్మినర్సయ్యకు అవకాశం ఇవ్వరన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి సైతం ఎంపీ అర్వింద్ కు సన్నిహితుడికి వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్వింద్ గత ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో బస్వ పూర్తిగా అర్వింద్ గెలుపుకోసం కష్టపడ్డారని పార్టీ నేతలు చెప్పుకుంటారు. అలాంటిది ప్రస్తుతం బస్వ కూడా ఎంపీ అర్వింద్ తో అంటీ ముట్టనట్లు ఉంటున్నారన్న చర్చ పార్జీ వర్గాల్లో జరుగుతోంది.


అయితే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగినట్లైతే గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చేసిన పల్లె గంగారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. పల్లె గంగారెడ్డి అర్వింద్ తో సఖ్యతగా ఉంటున్నారని... గతంలో అధ్యక్షపదవి చేశారు. పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో అర్వింద్ పల్లె వైపు మొగ్గు చూపుతారన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ బస్వ లక్ష్మీనర్సయ్యకు మళ్లీ బీజేపీ అధ్యక్షపదవి ఇవ్వకుంటే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. దీంతో ఇటు బస్వా లక్ష్మినర్సయ్య ఇటీవల కాలంలో యెండల లక్ష్మినారాయణతో క్లోజ్ గా  మూవ్ అవుతున్నట్లు పార్టీ క్యాడర్ చెప్పుకుంటోంది. మొత్తానికైతే ఇందూరు బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోందని చెప్పవచ్చు.