కరెంట్ ఆదాతోపాటు విద్యుత్ శాఖకు అమ్ముకునే వీలుగా సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసుకున్నారు కామారెడ్డి జిల్లా అంకోల్ గ్రామస్థులు. గ్రామంలో 80 శాతం కుటుంబాలు సౌర విద్యుత్‌ బాటలో నడుస్తున్నాయ్. రాష్ట్రంలోనే గ్రామాలకు దిక్సూచిగా మారింది అంకోల్‌ క్యాంపు. నేటి పోటీ ప్రపంచంలో విద్యుత్‌ వాడకంలో ఎన్నో రాష్ట్రాలు, దేశాలు, గ్రామాలు ఉన్నాయి. కానీ సౌర విద్యుత్‌ వాడకంలో దేశంలో పదుల సంఖ్యలోనే వాడుతున్న రాష్ట్రాలు కానీ గ్రామాలు కాని కనిపిస్తుంటాయి. విద్యుత్‌ ఆదాతోపాటు విద్యుత్‌ సంస్థకు తిరిగి విద్యుత్‌ను అమ్ముకునే వీలుగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ వాడుకోకుండా సౌర విద్యుత్‌ వాడకం దిశగా అడుగులు వేసింది కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం ఆంకోల్ క్యాంప్ గ్రామం చిన్నదే అయినా ఆలోచనలో మేటీ అని నిరూపించుకుంటున్నారు


అంకోల్ గ్రామంలో ఇప్పటికీ 80 శాతం కుటుంబాలు సౌర విద్యుత్‌ వాడకంలోనే ఉన్నాయి. అంతే కాకుండా విద్యుత్‌ను తిరిగి అమ్ముకునే దిశగా కృషి చేస్తున్న గ్రామంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సౌర విద్యుత్‌తోనే కాంతులు వెదజల్లుతోంది. ప్రతీ ఇంట్లో సౌర విద్యుత్‌ వాడకమే కాకుండా రాత్రి వేళల్లో విద్యుత్‌ స్తంభాల వెలుగులను కూడా సౌర విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. అంతే కాకుండా గ్రామంలో మొత్తం 400 మంది జనాభా ఉన్నారు. ఇందులో 195 మంది పురుషులు, 205 మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పటికే గ్రామంలో 50 కుటుంబాలు కూడా సౌర విద్యుత్‌ బాటలోనే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కుటుంబాలు 3 కేవీ మిగతా కుటుంబాలు 2 కేవీ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాకుండా విద్యుత్‌ను ఆదా చేసేందు కోసం సౌర విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు ఆ గ్రామస్థులు పేర్కొంటున్నారు.


గ్రామ సర్పంచ్‌ వెంకట్‌ రమణ సౌర విద్యుత్‌ వాడకాన్ని ప్రజలకు అలవాటు చేయడంతోపాటు విద్యుత్‌ సంస్థకు విద్యుత్‌ను అమ్ముకునే వీలు చేసేందుకు కృషి చేయడం అభినందనీయం. ఇప్పటికే ప్రతీ ఇంటిపై సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. 1కేవీ సౌర విద్యుత్‌ ప్లాంటుకు రూ.60వేలు ఖర్చు అవుతుండగా 3 కేవీ ప్లాంటుకు రూ.1.80 లక్షలు ఖర్చు అవుతోంది. అయితే వీటన్నింటికీ రెడ్‌కో ద్వారా 40 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతోంది. దీంతో పాటు 50శాతం స్త్రీనిధి ద్వారా బ్యాంకు లోను లభిస్తోంది. మిగతా 10 శాతాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. దీనిని సర్పంచ్‌ వెంకటరమణ ప్రతీ ఇంటింటికీ తిరుగుతూ సౌర విద్యుత్‌ వాడకాన్ని పెంపొందించాలని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడతామని ప్రజలకు అదర్శంగా నిలవడంతో పాటు రాష్ట్రంలోనే దిక్సూచి గ్రామంలో తీర్చి దిద్దడం జరుగుతుంది. 


మరోవైపు సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు విషయాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి దృష్టికి సర్పంచ్‌ తీసుకెళ్లగా వెంటనే స్పందించిన స్పీకర్‌, స్త్రీనిధి, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు కంపెనీ వారితో మాట్లాడి ఏర్పాట్లు చేపట్టారు. దీంతో టాటా కంపెనీ వారు 25సంవత్సరాల పాటు వారంటీ ఇస్తూ బ్యాంకు ఇచ్చిన రుణంతో 5 సంవత్సరాల్లో రుణాలు చెల్లించాల్సి ఉంటుందని మిగతా 20 సంవత్సరాలు ఉచితంగా విద్యుత్‌ను వినియోగిస్తూ మిగతా విద్యుత్‌ను విద్యుత్‌ సంస్థలకు అమ్ముకుంటూ ప్రజలే నేరుగా డబ్బును సంపాదించుకునే ప్రణాళికను రూపొందించారు. దీంతో ప్రజలకు లాభం చేకూరుస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ గ్రామాన్ని సందర్శించి సౌర విద్యుత్‌ ప్లాంట్లను పరిశీలించారు. విద్యుత్‌ వాడకాన్ని ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ద్వారా సౌర పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే అంకోల్‌ క్యాంపు గ్రామం సౌర విద్యుత్‌ వాడకంలో ఒక దిక్సూచిగా మారనుంది. త్వరలోనే గ్రామంలో మొత్తం కుటుంబాలు కూడా సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నారు.