నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేస్తున్న గౌతమి అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ వేధింపులే తన బిడ్డ ఆత్మహత్యకు కారణమని నర్సు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ వేధించడంతో తన కూతురు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఉన్న మనోరమ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసనకు దిగారు. 
అసలేం జరిగిందంటే..
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ముదక్ పల్లి గ్రామానికి చెందిన గౌతమి (21) నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సిస్టర్ గా పనిచేస్తున్నారు. అయితే అవసరం నిమిత్తం ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ డాక్టర్ వద్ద తన ఇంటి అవసరాల కోసం రూ. 80 వేలు అప్పుగా తీసుకుంది నర్సు గౌతమి. ప్రతినెలా ఆమె జీతంలో రూ.5 వేలు కట్ చేసుకుని మిగతా వేతనం ఇస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. అప్పు త్వరగా తీర్చాలని డాక్టర్ తరచూ వేధించేవాడని గౌతమి తల్లి లక్ష్మీ ఆరోపించింది. ఆసుపత్రి మేనేజ్ మెంట్, డాక్టర్లు సైతం తన కూతుర్ని వేధించేవారని చెప్పారు.


అప్పు ఒకేసారి తీర్చలేనని తన కూతురు చెప్పినా వినిపించుకోకుండా.. తన కూతుర్ని మానసికంగా, శారీరకంగా వేధించేవాడని కుటుంబసభ్యులు వాపోయారు. ఆ డాక్టర్ వేధింపులు భరించలేకనే తన కూతురు గౌతమి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు మృతికి ఆస్పత్రిలో విధులు నిర్వహించే డాక్టరే కారణమని.. గతంలో సైతం ఇలానే రెండు మూడుసార్లు ఆ డాక్టర్ వేధించాడని బాధితురాలి తల్లి చెప్పుకొచ్చింది .న్యాయం జరిగేంతవరకు తాము అక్కడ్నుంచి కదిలేది లేదంటూ నిరసనకు దిగారు. సంబంధిత డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆత్మహత్య చేసుకున్న నర్సు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం డ్యూటీకి వెళ్లొద్దని తాము చెప్పినా, వినిపించుకోకుండా హాస్పిటల్ కు వెళ్లిందని.. ఏం జరిగిందో కానీ ఇంటికి వచ్చిన కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు.


ఆత్మహత్య  చేసుకోవడానికి ముందు హాస్పిటల్ కు ఫోన్ చేసి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి సూసైడ్ చేసుకుంటున్నట్లు సమాచారం అందించింది. దీంతో ఆందోళనకు గురైన ఆ హాస్పిటల్ డాక్టర్.. నర్సు గౌతమి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వారి కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. గదిలో ఉరేసుకుని గౌతమి ఆత్మహత్య చేసుకుంది. కోరిక తీర్చాలని డాక్టర్ వేధించాడని, డబ్బులు ఇవ్వకుంటే ఇంటికి మనుషుల్ని పంపిస్తానని సైతం హెచ్చరించడంతో ఆందోళకు గురైన తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది యువతి తల్లి.