Dog Attacks MPP in Nirmal: తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట కుక్కల దాడి జరుగుతూనే ఉంది. ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఓ బాలుడిపై వీధికుక్కలు దాడి చేయగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నుంచి రోజుకో చోట రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడి జరుగుతూనే ఉంది. తాజాగా నిర్మల్ జిల్లా బాసర మండలం బిడ్రేల్లీలో బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్ పటేల్ పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డుపై ఆయన నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి ఓ వీధి కుక్క వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో విశ్వనాథ్ పటేల్‌కు గాయాలు కాగా... విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే వీధి కుక్క దాడి చేసిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెనక నుంచి కుక్క రావడాన్ని విశ్వనాథ్ గమనించలేదు. వెనుక నుంచి మెళ్లిగా వచ్చిన శునకం విశ్వనాథ్ కాళ్లను పట్టుకుంది. కుక్క గట్టిగా కరవడంతో విశ్వనాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి విషయం గుర్తించి తరమడంతో అక్కడ నుంచి కుక్క పారిపోయింది. అతడు తరిమి ఉండకపోతే ప్రాణాలు తీసేదని స్థానికులు చెబుతున్నారు.
రోజుకో జిల్లాల కుక్కల దాడులు.. ఆందోళనలో ప్రజలు
రెండ్రోజుల కిందట కామారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం వీధుల్లో కుక్కలను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు.
ఐదు రోజుల క్రితం హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వీధి కుక్కల దాడి ఘటన తెరపైకి వచ్చింది. మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు దాడికి ప్రయత్నించాయి. అయితే బాలుడు చాకచక్యంగా వీధికుక్కల దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.
మంచిర్యాలలో పిచ్చికుక్కల స్వైర విహారం..
ఇటీవల మంచిర్యాల జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1, జోన్ 2లో రెండు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయపడ్డారు. కాలనీవాసులు మున్సిపాలిటీ సిబ్బందికి కుక్కల స్వైర విహారం గురించి ఫిర్యాదు చేయగా.. గత రాత్రి నుంచి మున్సిపాలిటీ సిబ్బంది వాటికి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కుక్కలు దొరినట్టే దొరికి పారిపోవడంతో మున్సిపాలిటీ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ఈ కుక్కల దాడిలో 15 మందికి తీవ్ర గాయాలు అవడంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే వాటిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడిలో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం అందించడం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.