Ministers Satyavathi Rathod and Allola Indrakaran Reddy to visit Nagoba Temple: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి బయలుదేరి నిర్మల్ జిల్లా మీదుగా 11గంటలకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ కు చేరుకుంటారు. కేస్లాపూర్ లోని నాగోబా ఆలయానికి చేరుకొని నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుంటారు. ఆపై మెస్రం వంశీయులతో కలిసి జాతర విశేషాలు తెలుసుకుంటారు. 


అనంతరం జాతరలో ఐటిడిఎ (ITDA) ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఆయా శాఖల స్టాల్స్ ను సందర్శిస్తారు. ఆపై ప్రతియేటా నిర్వహించే నాగోబా దర్బార్ లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుండి నిర్మల్ జిల్లా (Nirmal District ) ఖానాపూర్ కు బయలుదేరి, అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. నాగోబా దర్బార్ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒ ఆద్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో పోలిస్ శాఖ ఆద్వర్యంలో ప్రత్యేక శిబిరం ఎర్పాటు చేసారు. ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 


నాగోబా జాతర.. నాగోబా దర్బార్ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈనెల 24న సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివాసీల అతిపెద్ద జాతరైన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరను మరియు రేపు జరిగే నాగోబా దర్బార్ ను పురస్కరించుకుని మంగళవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సెలవును తిరిగి 11-02-2023న రెండవ శనివారం పని దినంగా ప్రకటించారు. 


నాగోబా దర్బార్ ను 1942లో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ప్రారంభించారు. ఆనాడు నిజాం పాలనలో జల్ జంగల్ జమీన్ కోసం కుమ్రం భీం నిజాం సైన్యంతో పోరాడి అమరుడుకాగా.. ఆదివాసీలపై అద్యయనం చేసేందుకు నిజాం.. ఆస్ట్రియా దేశానికి చెందిన మానవపరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ ను 1940లొ పంపించి ఆదివాసీలపై అద్యయనం చేయించారు. ఈ కాల వ్యవధిలోనే 1942లో  కేస్లాపూర్ లో జరిగే జాతరకు ఆదివాసీలు అధికంగా రావడంతో గమనించిన డార్ఫ్.. కేస్లాపూర్ లో దర్బార్ ను నెలకొల్పారు. అప్పటి నుండి నాగోబా జాతరలో దర్బార్ ను కొనసాగిస్తున్నారు. దర్బార్ లో ఆదివాసీల ఆర్జీలు స్వీకరిస్తు సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారు.



 
ఈ ఆర్జీలలో అధికంగా ఆదివాసీలు పోడు భూములకు హక్కు పత్రాలు, త్రాగునీటి సౌకర్యం, వ్యవసాయ భూమి, త్రిఫేస్ కరెంటు, గ్రామానికి రోడ్డు, వంతెనలు, ట్రైకార్ లోన్స్, నివాస స్థలంతో పాటు ఇళ్ళ గురించి అందిస్తారు. ఇలా ఎన్నో ఏళ్ళుగా ఆదివాసీల సమస్యలు ఇంకా ములనపడే ఉన్నాయి. ఆదివాసీల సమస్యలపై ఆదివాసీలు పోరాడుతునే వస్తున్నారు.