MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికే ఈ వాహనం ఐదు సార్లు నడిరోడ్డుపై నిచిలిపోగా.. తాజాగా శంషాబాద్ నుంచి వస్తుండగా పురాణాపూర్ సర్కిల్లో ఆగిపోయింది. తరచుగా తన వాహనం రోడ్డుపై ఆగిపోతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ చెబతున్నారు. అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం ఇస్తుందని.. అవసరం ఉన్న తనకు మాత్రం సరైన వాహనాన్ని అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేకపోవడంతో వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు చెప్పానని వివరించారు. అయినా కూడా పోలీసులు వినడం లేదని.. ఇలాంటి వాహనాన్ని ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదు తెలిపారు. 


మూడు నెలల క్రితం కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఫైర్


తన భద్రతకు ముప్పు ఉందని మూడు నెలల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇంటెలిజెన్స్ ఐజీకి లెటర్‌ రాసిన రాజాసింగ్.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తన బుల్లెట్ ప్రూఫ్‌ వాహనం మార్చాలని రిక్వస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటెలిజెన్స్‌ ఐజీకి లేఖ రాశారు. తరచూ తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం బ్రేక్‌డౌన్ అవుతుందని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని ప్రశ్నించారు. కొత్త వాహనాలు కొనడానికి డబ్బుల్లేవా లేకుంటే కేసీఆర్ అనుమతి లేదా అని ఆరా తీశారు. ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా.. లేకుంటే అధికారులే సైలెంట్‌గా ఉంటున్నారా అని అడిగారు. 


ఇలాంటి వాహనమా అని ఆగ్రహం 


జైలు నుంచి విడుదలైన తర్వాత రోజు కూడా బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంపై అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంటే తనకు ఇలాంటి వాహనం ఇస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ముప్పు పొంచి ఉందన్న క్రమంలో కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా రిపేర్ చేయించాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై రాజా సింగ్ మాట్లాడుతూ.. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరించిందని, దాంతో అధికారులు బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం కేటాయించినట్లు చెప్పారు.





మొదట నాలుగు నెలల కిందట బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డు మధ్యలోనే ఆగిపోతే రిపేర్ చేయించడానికి ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి పంపించాను. రిపేర్ చేసి మళ్లీ తనకు ఇచ్చినా పరిస్థితిలో ఏ మార్పు లేదన్నారు.  నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ రెండు నెలల క్రితం మళ్లీ ఆగిపోయిందని తెలిపారు. దాంతో చేసేదేమీ లేక గన్ మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. ఓసారి అఫ్జల్‌గంజ్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే సొంత వాహనంలో వెళ్లాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటెలిజెన్స్‌ ఐజీకి లేఖ రాశారు. ఇకపైన అయినా అధికారులు, ప్రభుత్వం స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.