Amit Shah in Kagaznagar- కాగజ్ నగర్: తెలంగాణలో బీజేపీ ఓటు షేర్ ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతుందని, ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ 10 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణలో ఒక్క సీటులో గెలవగా, 2019లో 4 స్థానాల్లో గెలిపించారు.. ఇప్పుడు మరిన్ని సీట్లు వస్తాయని డైరీలో రాసిపెట్టుకోవాలన్నారు. కాగజ్ నగర్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అమిత్ షా ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓవైసీకి భయపడుతాయి.. ఎంఐఎంకు భయపడే బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణను అభివృద్ధి చేయలేదని, రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీ వల్లే సాధ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండు పార్టీల మధ్యే పోటీ కొనసాగుతోందన్నారు. రెండు విడుతల పోలింగ్ లో ప్రధాని మోదీ ఇప్పటికే సెంచరీ కొట్టారని, మూడో విడుత పోలింగ్ లో దాదాపు 200 సీట్లకు రీచ్ అవుతాం అన్నారు. తెలంగాణలో పోలింగ్ వచ్చే సరికి 250 కి పైగా స్థానాలను దాటేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. 


అమిత్ షా మాట్లాడుతూ.. ‘తెలంగాణలో రెండు పార్టీల మధ్యే పోటీ అని, ఈ ఎన్నికల్లో ఒక వైపు మోదీ ఉంటే మరోవైపు రాహుల్ గాంధీ ఉన్నాడు. 12 లక్షల కోట్ల అవినీతి చేసిన పార్టీ కాంగ్రెస్. పదేళ్ల ప్రధానిగా చేసినా నరేంద్ర మోదీపై అవినీతి మచ్చ కూడా లేదు. ఒకవైపు సిల్వర్ స్పూన్ తో పుట్టిన రాహుల్, మరోవైపు నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎన్నికల బరిలో నిలిచారు. ఉష్ణోగ్రత పెరిగితే రాహుల్ విదేశాలకు పారిపోతాడు. పేదలకు అండగా నిలిచే మోదీ కావాలా? రాహుల్ బాబా కావాలా?. దేశ వ్యాప్తంగా మోదీనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. 


కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు
కాంగ్రెస్ నేతలు అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్లలేదు. ఓటు బ్యాంకు అనే భయం అందుకు కారణం. వారి ఓటు బ్యాంకు గిరిజనులు, ఆదివాసీలు కాదు. కాంగ్రెస్ నేతల ఓటు బ్యాంకు ఒవైసీ ఓటు బ్యాంకు ఒక్కటే. మేం ఓటు బ్యాంకుకు భయపడే వాళ్లం కాదు. మేం కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేస్తే రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు దాంతో ఏం పని అని మల్లిఖార్జున ఖర్గే అంటున్నారు. తెలంగాణ ప్రజలు కశ్మీర్ కోసం కూడా ప్రాణమిస్తారు. ఉగ్రవాదుల నుంచి విముక్తి కలిగించే పని మోదీ చేస్తున్నారు.- అమిత్ షా 


మోడీ సర్కార్ వచ్చాక సర్జికల్ స్ట్రైక్
‘సోనియా, మన్మోహన్ సర్కార్ ఉన్నప్పుడు ఆలియా, మాలియా, జమాలియా  ఇంకెవరెవరో వచ్చి మనపై దాడులు చేసేవారు. కానీ ప్రధాని మోదీ సర్కార్ వచ్చాక సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ప్రధానిగా ఉన్నది మన్మోహన్ కాదు మోడీ అని వాళ్లకు అప్పుడు అర్థమైంది. కరోనా టైంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తే ఎవరూ వేసుకోవద్దు అని రాహుల్ అన్నాడు. కానీ రాహుల్, ప్రియాంక గాందీ ఎవరికీ కనిపించకుండా చీకట్లో వ్యాక్సిన్ వేసుకున్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఫేక్ వీడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్వార్డ్ చేశాడు. రిజర్వేషన్లు రద్దు చేసేది లేదని మోదీ గ్యారంటీగా చెబుతున్నా. పదేండ్లు బీఆర్ఎస్ అవినీతి జరిగిందిఇప్పుడు కాంగ్రెస్ అవినీతి చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంది. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. గతంలో పేపర్ ఫ్యాక్టరీ ఉండేది, అది కూడా మూతపడిందని’ అమిత్ షా అన్నారు.


కాంగ్రెస్ ఇచ్చిన మతపరమైన రిజర్వేషన్లు అవసరమా?
కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి గిరిజనులు, ఆదివాసీ, దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. గిరిజనులు, ఆదివాసీలు, దళితుల రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పంచుతోంది. తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ ను తిరిగి అమలు చేస్తామని రాహుల్ అంటున్నాడు. ముస్లిం పర్సనల్ లా ఆధారంగా పాలన చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్వహించలేదు కానీ బీజేపీ ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుందని గుర్తుచేశారు.