బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణమాఫీ చేసి, పేదలకు సంక్షేమ పథకాలు ఆపాలని కేంద్రం కుట్ర చేస్తుందని బీజేపీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆపేందుకు కుట్రలు పన్నుతూ, కోర్టులను సైతం ఉపయోగించుకుంటున్న బీజేపీ ప్రభుత్వ తీరును దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వమని, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. 


సంక్షేమ రాజ్యం తెలంగాణ


తెలంగాణలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. “40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. మరో 10 లక్షల మందికి పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. 65 లక్షల రైతులకు రైతు బంధు, ప్రతి రంగంలో ఉన్న పేదవారికి ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. తెలంగాణ బాటలోనే అనేక రాష్ట్రాలు పథకాలు అమలు  చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 


సంక్షేమ పథకాలు ఆపాలా


రైతులకు ఎంతో మేలు చేస్తున్న రైతు బంధు ఆపాలా, గురుకుల విద్యను ఆపుకోవాలా, చేపలు, గొర్రెల పంపకం ఆపాలా, ఆసరా బీడీ పెన్షన్లు ఆపాలా.. ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఉచితం అంటే ప్రజలు పేదరికం నుంచి బయటపడాలని, పేద ప్రజల్లో అభ్యున్నతి రావాలని ప్రభుత్వం చేసే సహాయమని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. సంక్షేమాన్ని, ఉచితాన్ని వేరుగా చూడాలని బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూచించారు.


పేదలను కొట్టు.. పెద్దలకు పెట్టు


పేదలకు ఉచితాలు ఆపి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తులకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ చేయాలి.. కానీ పేదలకు పెన్షన్ వద్దా... అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.


బీజేపీ వైఖరిని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి


తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల ప్రజలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సమీక్ష కోసం పంపిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, దానిపట్ల రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకతను వ్యక్తపరిచినప్పుడే ఆ నిర్ణయాన్ని ఆపే అవకాశం ఉంటుందని అన్ని రాష్ట్రాలకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. 


సంక్షేమాలు ఆపితే సబ్బండ వర్గాలకు ఇబ్బందే అన్నారు కవిత. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఉచితాల కింద ఆపేస్తే, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో , తెలంగాణ మేధావులంతా ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.