Mandava :   మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు బీజేపీ ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత  మండవ వెంకటేశ్వరరావు రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా ఉండటం లేదు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరినా అక్కడ కూడా అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. పైగా మండవ వంటి మోస్ట్ సీనియర్ లీడర్ కి టీఆర్ఎస్ లో సరైన గౌరవం దక్కకపోటవంతో సహజంగా ఆయన పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంపై మండవకు మంచి పట్టుంది. గతంలో 5 సార్లు మండవ ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఈ నియోజకవర్గం నుంచే. రూరల్ లో సెటిలర్స్ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉంటారు. 


నిజామాబాద్ రూరల్‌లో బలమైన నాయకుడి కోసం చూస్తున్న బీజేపీ


 రూరల్ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ప్రస్తుతం రూరల్ ఎమ్మల్యేగా సీనియర్ నాయకుడు బాజిరెడ్డి గోవర్దన్ ఉన్నారు. బాజిరెడ్డి ని ఢీ కొట్టాలంటే మండవ లాంటి సీనియర్ నాయకులు ప్రస్తుతం కమలం పార్టీకి అవసరం. మరోవైపు మండవ మాత్రం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మండవకు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలన్న ఆలోచన కూడా లేదన్న వాదన వినిపిస్తోంది.  మండవ లాంటి సీనియర్ నాయకులు రాజకీయాల్లో ఉండటం అవసరం అంటున్నారు ఆయన అనుచరులు. రూరల్ బీజేపీ పార్టీ బలపడుతుండటం... ఆనంద్ రెడ్డి మరణం తర్వాత ఆ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన లీడర్ కరువయ్యారు. దీంతో మండవ బీజేపీ చేరాలని అనుచరుల ఒత్తిడి కూడా పెరిగింది. 


మండవను ఆహ్వానిస్తున్న బీజేపీ 


మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా మండవ వస్తే బాగుంటుందన్న ఆభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలు మండవతో టచ్ లో ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయ్.  తెలంగాణ ఉద్యమ సమయంలో 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత రాజకీయ మార్పులకు అనుగుణంగా మండవ టీడీపీ దూరంగా ఉంటూ వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మండవ వెంకటేశ్వరరావు గులాబీ కండువా కప్పుకున్నారు. మొదటి నుంచి మంచి స్నేహితుడైన కేసీఆర్ ఆహ్వానం మేరకు కాదనకుండా మండవ కారెక్కారు.జాయిన్ అయినప్పుడు మండవకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు లేకుండా పోయింది. మండవకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తారని అంతా అనుకున్నారు. మండవకు ఉన్న రాజకీయ అనుభవానికి తగ్గట్టు పార్టీలో గుర్తింపు ఉంటుందని భావించినా అదీ జరగలేదు.  


బీజేపీ ఆహ్వానాన్ని మండవ మన్నిస్తారా ? 
  
నిజంగా మండవ టీఆర్ఎస్ ను వీడి కారెక్కుతారా అని అడిగితే సరైన సమాధానం మాత్రం లేదు. కానీ ఆయన బీజేపీలోకి చేరుతారన్న ప్రచారం మాత్రం జిల్లాలో జోరుగా సాగుతోంది. మండవ లాంటి సీనియర్ నాయకుల రాజకీయ అనుభవం ఈ తరుణంలో బీజేపీకి ఎంతైనా అవసరం. పార్టీకి మండవ సేవలను ఉపయోగించుకోవాలన్న ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మండవ మదిలో ఏముందో అన్నది ప్రస్తుతానికి మాత్రం తెలియట్లేదు. కమలం గూటికి చేరుతారా లేక కారులోనే ప్రయాణం చేస్తారా అన్నది జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో మాత్రం ఆసక్తిగా మారింది.