మనసులోని భావాలకు, ఊహలకు చిత్ర రూపంలో ఊపిరి పోస్తే అది చిత్రకళ అవుతుంది. అలాంటి చిత్రకళలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు ఓ ఆదివాసి యువకళాకారుడు. తన మనసులో మెదిలిన భావాలకు రంగులను అద్ది.. చక్కటి చిత్రాలుగా రూపొందిస్తున్నాడు. ఆ యువ కళాకారుడి ప్రతిభను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ తనకు ప్రోత్సాహం, మద్దతు దొరికితే మరింత రాణిస్తా అంటున్నాడు.  ఇంతకీ ఆ ఆదివాసి కళాకారుడు ఎవరు..? ఆయన గీసిన ఆ అద్భుత కళా చిత్రాలేంటి..? abp దేశం స్పెషల్ స్టోరీలో మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.

Continues below advertisement

ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాల ఉట్టిపడేలా పెయింటింగ్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం, సోయంగూడ గ్రామానికి చెందిన మెస్రం రాము ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాల పెయింటింగ్స్ ను వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న మెస్రం రాముకు చిన్నతనం నుండే పెయింటింగ్స్ అంటే అభిమానం. అయితే ప్రత్యేక చిత్రలేఖనంలో శిక్షణ తీసుకోకపోయిన అద్భుతంగా తన ఆలోచనలకు అనుగుణంగా రంగులను అద్ది అద్భుత చిత్రాలను రూపొందిస్తున్నాడు.

Continues below advertisement

మెస్రం రాము గీసిన చిత్రాల్లో జీవకళ ఉట్టిపడుతోంది. ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను రూపొందిస్తున్నాడు. ఆదివాసీలు అడవుల్లో సేకరించే ఇప్ప పువ్వు సేకరణ, గుస్సాడి దండారి వేడుకల్లో నృత్యాలు, పక్షులు, వన్యప్రాణులు, ఆదివాసుల వనదేవతలు ఇలా ప్రకృతి నుండి ఆదివాసుల పద్దతుల వరకు అనేక రకాల చిత్రాలను అద్భుతంగా పెయింటింగ్ వేస్తూ అబ్బురపరుస్తున్నాడు. సుందరమైన కళాఖండాలను సృష్టిస్తున్నాడు. 

ఆకట్టుకున్న మెస్రం రాము హస్తకళ

కేవలం ఆదివాసీల ఆచారాలు, పద్దతులను, పండుగలు ప్రతిబింబించే చిత్రాలకు ప్రాణం పోస్తూ వాటిని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ప్రకృతి అందాలనుండి ఆదివాసుల పద్దతుల దాకా రకరకాల బొమ్మలను గీసి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన, అమ్మకపు మహోత్సవంలో మెస్రం రాము కూడా ఓ స్టాల్ ను ఏర్పాటు చేశాడు. ఇందులో  తాను గీసిన చిత్రాలను ప్రదర్శించాడు. తన చిత్రకళతో సందర్శకులను మంత్రముగ్దులను చేశాడు. గోండి ఆర్ట్ కు జీవం పోస్తున్న ఆ యువ కళాకారుడి ప్రతిభను సందర్శకులు కొనియాడారు. సంప్రదాయాలను కాపాడుకోవాలని తపన పడె ఈ యువ చిత్రకారుడి ప్రతిభను చూస్తే ఎవరైనా సరే అభినందించక మానరు. 

ఎలాంటి శిక్షణ లేకుండానే రాణింపు

అయితే తానేమి ప్రత్యేకంగా చిత్రకళలో శిక్షణ తీసుకోలేదని, 8వ తరగతి నుండి పెయింటింగ్ వేస్తూ నేటి వరకు తనకున్న కళ ద్వారా తమ సంస్కృతి సాంప్రదాయాలపై పెయింటింగ్ వేస్తున్నానని మెస్రం రాము abp దేశంతో చెప్పారు. తన ఆలోచనలను క్యాన్వాస్ పై పెట్టి వాటికి రంగులను అద్ది వాటిని బొమ్మలుగా మలుస్తున్నానని వివరించాడు. క్యాన్వాస్ ఇతర రంగులు తన సొంత డబ్బులతో ఆర్డర్ చేసి ఇలా పెయింటింగ్స్ చేస్తున్నానని తెలిపాడు. ఇంకా తమ ఆదివాసి సంస్కృతికి చెందిన చాలా రకాల పెయింటింగ్స్ ను వేసి తనకున్న లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇదే వృత్తిగా ముందుకెళతానని స్పష్టం చేశాడు. 

తాను చదువు ఇంటర్ తోనే ఆపేశానని, ఇక పెయింటింగ్ ఒక్కటే తనకు ఇష్టమని, అయితే తనకు తనకున్న లక్ష్యాన్ని చేరుకునేవరకు కొంత ప్రోత్సాహాన్ని, ఐటిడిఏ అధికారులు అందించాలని, ఐటీడీఏ కార్యాలయం, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోను వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విద్యా నైపుణ్యాలకు సంబంధించిన తన పెయింటింగ్స్ వేస్తానని, కాబట్టి ఐటిడిఏ ఆధ్వర్యంలో తనకు చిన్న ఉపాధి దిశగా అవకాశం కల్పించాలని మెస్రం రాము వేడుకొంటున్నాడు.