Mancherial Latest News:మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగాయి. ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో కొక్కిరాల సత్యపాల్ రావ్ విజయం సాధించారు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి విక్రమ్ రావ్ పై 33 ఓట్ల మెజారిటీతో సత్యపాల్ రావ్ గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో సత్యపాల్ రావ్ కు 141 ఓట్లు రాగా.. విక్రమ్ రావ్ కు 108 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ తన తమ్ముడు సత్యపాల్ రావ్ ను బలపరచగా.. పుస్కూరి విక్రమ్ రావ్ కు మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు మద్దతు పలికారు. ఈ ఎన్నికలు చిన్నవే అయినా.. మంత్రి వివేక్ అనుచరుడు పుస్కూరి విక్రమ్ రావ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావ్ తమ్ముడు కొక్కిరాల సత్యపాల్ రావ్ ఈ ఇద్దరు పోటీ పడటం ఎన్నికల్లో వేడి రాజేసింది. అయితే విక్రమ్ రావ్ కు మంత్రి వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పెద్దపల్లి ఎంపీ మద్దతు చెప్పారు.
ఓరియంట్ సిమెంట్ కార్మిక సంఘం, లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయిమెంట్ వర్కర్స్ యూనియన్ విక్రమ్‌రావ్కు మద్దతు ప్రకటించింది. తెలంగాణ ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సత్యపాల్‌రావ్కు మద్దతు ఇచ్చింది. ఓరియంట్ సిమెంట్ పర్మినెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ తటస్థంగా ఉండిపోయింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగింది.
ఉదయం 7 గంటల నుంచి స్వల్పంగా కొనసాగిన కార్మికుల పోలింగ్ 11 గంటల వరకు ఒక్కసారిగా 150 ఓట్లు పోలయ్యాయి. కార్మికుల తరలింపు విషయంలో కంపెనీ గేటు ఎదుట స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకొని కార్మికులను పోలింగ్ కేంద్రానికి తరలించారు. కంపెనీలో మొత్తం 266 మంది కార్మికులు ఉన్నారు. పోలింగ్ సమయం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్నప్పటికీ కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకే ఓటు వేశారు. మొత్తం 266 ఓట్లలో 265 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం మీద పోలీసు బందోబస్తు నడుమ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
కేవలం ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపించాయి. రెండు వర్గాలు భారీగా ఖర్చు చేయగా.. చివరకు ఓటర్లను క్యాంపులకు సైతం తరలించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. ఇంత జరిగిన చివరికి కొక్కిరాల సత్యపాల్ రావ్ విజయం సాధించాడు. విజయం సాధించిన తరువాత కొక్కిరాల సత్యపాల్ రావ్ బయటకు రాగా.. ఆయన అనుచరులు, కార్మికులు ఒక్కసారిగా కేరింతలు పెడుతూ ఆయనను ఎత్తుకొని చిందులేశారు. ఆటపాటల మధ్య నృత్యాలు చేశారు.
అనంతరం సత్యపాల్ రావ్ మీడియాతో మాట్లాడారు. ఓరియన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో సాధించిన విజయం ఇది కార్మికుల విజయమని, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధంలో ధర్మానిదే విజయం జరిగిందన్నారు. ఇది ఒక వ్యవస్థ మీద ఉన్న నమ్మకం అని, తమ అన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ నిర్మించిన వ్యవస్థ అని, ఆ వ్యవస్థనే ధర్మానికి నాంది పలికిందన్నారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు తెలిపారు. తన అన్న ఆశయాలకు అనుగుణంగా అలాగే జనక్ ప్రసాద్ లాంటి పెద్దల అండదండలతో ముందుకు నడుస్తానన్నారు.