Kumram Bheem Asifabad Peddavagu temporary bridge | కాగజ్ నగర్: సిర్పూర్(టి) ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు దీక్ష ఫలించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి పెద్ద వాగు తాత్కాలిక బ్రిడ్జి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం తెలిసిందే. బ్రిడ్జి పనులకు తక్షణమే చేపట్టి బ్రిడ్జిపై రాకపోకలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సోమవారం ఉదయం నుంచి హరీష్ బాబు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వరద ప్రవాహానికి తాత్కాలిక బ్రిడ్జి కొంతభాగం కొట్టుకపోవడంతో 24 గంటల్లోగా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆదివారం లేఖ రాశారు.




సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దీక్ష 
అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి మరమ్మతుల పనులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం (జూన్ 24న) హరీష్ బాబు తాత్కాలిక బ్రిడ్జి వద్ద నిరాహార దీక్ష చేపట్టగా.. అధికారులు సాయంత్రం లోపు ఆ పనులన్నీ పూర్తి చేశారు. ఎట్టకేలకు ఆర్ అండ్ బి అధికారులు బ్రిడ్జి చివరన ఉన్న కట్టనిర్మాణాన్ని పూర్తిచేసి రాకపోకలకు వీలుండేలా రోడ్డును సిద్ధం చేశారు. దీంతో అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జిపై రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన దీక్షకు ఫలితం దక్కిందని, అందవెల్లి గ్రామానికి చెందిన గుండా సంతరమ్మ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.


వాహన రాకపోకలు ప్రారంభించిన  ఎమ్మెల్యే 


అనంతరం సిర్పూర్ ఎమ్మేల్యే డా‌.పాల్వాయి హరీష్ బాబు ఆటోలో జగన్నాథ్ పూర్ వైపు వెళ్లి వాహన రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. కేవలం 24 గంటల్లోనే వాహనాల రాకపోకలను పునరుద్ధరించడం ప్రజా విజయమని, సహకరించిన జిల్లా అధికార యంత్రంగానికి ప్రత్యేకించి ఆర్ అండ్ బి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో సిర్పూర్ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తుతామని, ప్రభుత్వం వాటికి పరిష్కారం సూచించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని హరీష్ బాబు చెప్పారు.