Case filed against Asifabad MLA Kova Laxmi | ఆసిఫాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావును అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే కోవలక్ష్మీ దూషించారాని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు విశ్వనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సెక్షన్ 124/24 అండర్ సెక్షన్ 296(B),351(2)BNS ప్రకారం ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. 


ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేల పైన కూడా అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ పైన ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి ఆమె నిరసన తెలిపారని కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరిగే పనులలో ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలని కోరనందున.. పోలీసులు, ఎమ్మెల్యే పైనే ఏకపక్షంగా కేసు నమోదు చేయడం అక్రమం అన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడంపై పోలీసులను కేటీఆర్ ప్రశ్నించారు.