213 convicts released from 13 prisons in Telangana | హైదరాబాద్: తెలంగాణలో మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదీల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలపడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తెలంగాణ ప్రభుత్వం ఖైదీల విడుదలకుగానూ మంగళవారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలకు జైళ్ల శాఖ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం విడుదలవుతున్న ఖైదీల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను సైతం ఏర్పాటు చేసింది. 


తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో ఓ మైలు రాయి 
జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. సత్ ప్రవర్తన కారణంగా విడుదలవుతున్న ఖైదీలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు (జులై 3) తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో ఓ మైలు రాయి లాంటిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణిలో భాగంగా ఖైదీల కుటుంబ సభ్యులు వారిని   విడుదల చేయాలని దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. ఖైదీల కుటుంబసభ్యుల వినతులను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఈ హైలెవెల్ కమిటీ ఒక లిస్ట్ తయారు చేయగా.. ఆ లిస్ట్‌ను కేబినెట్‌కు పంపితే ఆమోదం లభించింది. చివరగా ఆ జాబితాను గవర్నర్ రాధాకృష్ణన్ వద్దకు తీసుకెళ్లగా ఆయన ఆమోదించారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. అనంతరం ఈ ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.


వీరిలో 205 మంది యావజ్జీవ కారాగర శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, 8 మంది స్వల్పకాలిక శిక్ష అనుభవిస్తున్న ఖైదులు విడుదలవుతున్నారని తెలిపారు. ఆ ఖైదీలకు ఇది జీవితంలో రెండో అవకాశమని, ఈ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జైళ్లలో తాము కేవలం శిక్ష మాత్రమే కాదు, వారికి జీవితంలో పనులు చేసుకుని జీవించగలిగేలా పలు వృత్తి విద్య నైపుణ్యాలలో శిక్షణ కూడా ఇచ్చామన్నారు. జైలులో ఖైదీలు తయారు చేసే వస్తువులకి మార్కెట్‌లో డిమాండ్ ఉందని, ఇక్కడికి వచ్చిన నిరక్షరాస్యులను సైతం అక్షరాస్యులుగా మార్చినట్లు చెప్పారు. కొందరు ఖైదీలు జైలులో చదువుకుని పట్టభద్రులు అయ్యారని, అందులో గోల్డ్ మెడల్ సాధించిన వారు కూడా ఉన్నారని డీజీ సౌమ్య మిశ్రా చెప్పారు.


జైలు నుంచి విడుదలయ్యాక జీవించడానికి శిక్షణ ఇచ్చామని, వారికి జాబ్ మేళా నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించామని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో 70 మంది ఖైదీలకు ఉపాధి కల్పించారు. శిక్షకాలంలో ఇస్తున్న జీతం కంటే, ఇప్పుడు ఇంకా ఎక్కువ జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. ముగ్గురు మహిళా ఖైదీలకు జైళ్ల శాఖ స్టోర్లలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటివరకు విడుదలైన ఖైదీలలో మూడో వంతు ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించామని, విడులయ్యాక ఉపాధి దొరక్కపోతే తమను సంప్రదించాలని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.


ఉపాధి పొందుతామని కొంతమంది మహిళా ఖైదీలు కోరగా.. వారందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా మెరుగైన సమాజం కోసం పనిచేయాలని సూచించారు. ఆ ఖైదీల పట్ల కుటుంబం, సమాజం సానుభూతితో ఉండాలన్నారు. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలకు వారి స్వస్థలాలకు వెళ్లడానికి జైలు అధికారులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.


జైళ్ల వారీగా విడుదల అవుతున్న ఖైదీల వివరాలు..
- చర్లపల్లి కేంద్ర కార్యాలయం నుంచి- 61
- మహిళల ప్రత్యేక కారాగారం నుంచి -35
- చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి- 31
- హైదరాబాద్ కేంద్ర కారాగారం నుంచి- 27
- వరంగల్ కేంద్ర కారాగారం నుంచి -20
- నిజామాబాద్ కేంద్ర కారాగారం నుంచి- 15
- కరీంనగర్ జిల్లా జైలు నుంచి- 7
- ఖమ్మం జిల్లా జైలు నుంచి -4
- నల్లగొండ జిల్లా జైలు నుంచి- 4
- ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి- 3
- ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు నుంచి- 3
- మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి- 2
- సంగారెడ్డి కేంద్ర కారాగారం నుంచి-1
మొత్తం 213 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదలై సొంత గ్రామాలకు వెళ్తున్నారు.