Khanapur MLA Meets CS: కేస్లాపూర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి - సీఎస్ శాంతి కుమారిని కోరిన ఖానాపూర్ ఎమ్మెల్యే
కేస్లాపూర్ అభివృద్ధికి రూ.13 కోట్లు కేటాయించాలని సిఎస్ శాంతి కుమారిని కలిసి చర్చించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్. అటవీ, రోడ్లు, విద్య, వైద్యం, ఐటిడిఎ అంశాలపై మాట్లాడారు.
Khanapur MLA Vedma Bojju | దక్కన్ పీఠభూమిలో ఆదివాసులకు ఆరాధ్య దైవంగా కొలువై ఉన్న కేస్లాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పర్చెందుకు రూ. 13 కోట్లు ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సచివాలయంలో సిఎస్ శాంతి కుమారితో మంగళవారం సమావేశమై పలు అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో అటవీ శాఖ అభివృద్ధికి సహకరించడం లేదని సీఎస్ శాంతికుమారికి ఎమ్మెల్యే వివరించారు.
టైగర్ జోన్ పరిధిలో వాహనాల రాకపోకలను అటవీ శాఖ అడ్డుకొవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అటవీ అనుమతులు రాకపోవడంతో మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణం నిలిచిపోయిందని ఎమ్మెల్యే సి.ఎస్ దృష్టికి తీసుకొచ్చారు. విద్య,వైద్యం సమస్యలు పరిష్కరించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఎ కు నిధులు విడుదల చేయాలని కోరారు. ఇటీవల ఆదివాసీ ప్రతినిధులతో సీఎం సమావేశమైనప్పుడు చర్చకు వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కోరారు.