పక్క రాష్ట్రాల్లో ధరలు తక్కువ ఉన్నాయని సామాన్య ప్రజలు తమ వాహనాలను తీసుకెళ్లి పెట్రోల్ డీజిల్ కొట్టిస్తుంటారు. ఇది సర్వసాధారణంగా సరిహద్దు గ్రామాల్లో జరిగే తంతే. కానీ తెలంగాణలో మాత్రం ఏకంగా ఆర్టీసీ సిబ్బందే తమ బస్‌లకు అలా చేసి అడ్డంగా బుక్కయ్యారు. 


ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్క డిపోకు ఎనిమిది నుంచి పది వేల లీటర్ల డీజిల్ అవసరం పడుతుంది. కర్ణాటక నుంచి వస్తున్న డీజిల్ పది రూపాయలు తక్కువ ఉండటం వల్ల అక్కడి నుంచి డీజిల్ తీసుకొస్తున్నారు. కర్ణాటక నుంచి డీజిల్ తీసుకొస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ఒక్క లీటర్‌కు 24 రూపాయల టాక్స్ గండి కొడుతున్నారు. సదరు డిపో అధికారికి వివరణ కోరగా ఇన్వాయిస్ తెలంగాణది చూపించారు. ఒక్క డిపోకు ఎనిమిది వేల నుంచి పదివేల లీటర్ల డీజిల్ అవసరం పడగ ప్రతిరోజు 2 లక్షల 40 వేల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొడుతున్నారు డిపో అధికారులు.


ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆరు డిపోలు ఉండగా ఒక్కో డిపో నుంచి ప్రతి రోజూ 2 లక్షల 40 వేలు రాష్ట్ర ప్రభుత్వానికి  గండి కొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకోవాల్సిన ఇండియన్ ఆయిల్‌ను పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో డీజిల్ ధరలు తక్కువగా ఉన్నందున కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా డీజిల్ తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్రానికి టాక్స్ రూపంలో కట్టాల్సిన ఒక లీటరుకు 24 రూపాయలు కట్టకుండా డిపో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.


రెండో డిపో డివిజినల్ మేనేజర్ విజయ్ భాను.... కర్ణాటక రాష్ట్రం మకర నుంచి తీసుకొస్తున్నామని తమకు ఆర్డర్స్ ఉన్నాయని సమాధానం చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో లభించే డీజిల్ వాడాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి డీజిల్ తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. డీజిల్ ట్యాంకర్ కు ఎన్ఓసి చూపెట్టమని కోరితే మాట దాటవేస్తున్నారు డిపో అధికారులు.


ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన అధికారిని, సివిల్ సప్లై అధికారులు లోనికి పోకుండా డిపోకు సంబంధించిన సిబ్బంది అడ్డుపడుతున్నారు. ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ను చెక్ చేసి తీరుతామని వాటికి సంబంధించిన ఎన్వోసీ చూపెట్టాలని కోరినప్పటికీ వారికి కూడా అనుమతి లేదని అడ్డుపడుతున్నారు. అప్పటివరకు డిపోలో ఉన్న అధికారులు సమాధానం చెప్పి చెప్పినట్టే ఎన్ఓసి చూపెట్టకుండా తప్పించుకున్నారు. అయితే మొత్తంగా దీని వెనుక పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టి లక్షల రూపాయలు ప్రతి రోజు చేతులు మారుతున్నట్టుగా తెలుస్తోంది.