సామాన్యుడి ఓ న్యాయం అధికారులకు మరో న్యాయం అన్నట్లుంది కామారెడ్డి ట్రాఫిక్ పోలీసుల తీరు అని విమర్శలు వస్తున్నాయి. సామాన్య ప్రజల వాహనాలకు చాలాన్లు పెండింగ్ లో ఉంటే ట్రాఫిక్ పోలీసులు ముక్కు పిండి వసూలు చేస్తారని, ఎక్కువ మొత్తంలో చలాన్లు పెండింగులో ఉంటే కనీసం సగం అయినా చెల్లించకుంటే వాహనాన్ని ఆడ్డంగా నిలిపేస్తారు. అదే ఉన్నతాధికారుల విషయం అయితే అటువైపు కన్నెత్తి చూడరని బాధితులు అంటున్నారు. ఇక్కడ చలాన్లు పెండింగులో ఉంచిన అధికారి చిన్నచితకా అధికారి కాదు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ అధికారిక వాహనంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 చలాన్లు పెండింగులో ఉన్నాయి. సామాన్యులను ఆపి, ప్రశ్నించి, చలాన్లు వసూలు చేసే ట్రాఫిక్ పోలీసులు అధికారుల వద్ద నుంచి చలాన్లు ఎందుకు వసూలు చేయడం లేదు, చర్యలు తీసుకోవడం లేదని తరచుగా వినిపిస్తోంది. తాజాగా కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ వాహనంపై ఉన్న చలాన్ల వివరాలు బయటకు రావడంతో హాట్ టాపిక్ అవుతోంది.
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కు చెందిన వాహనం టీఎస్ 17 సి 7299 నంబర్ గల కారుపై జిల్లా బార్డర్ లోనే కాదు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలాన్లు నమోదయ్యాయి. అన్ని ఫైన్లు కూడా ఓవర్ స్పీడ్ తో వాహనం నడపడం వల్లే చలాన్లు పడ్డాయి. ఆ వాహనంపై మొత్తం 9 చాలన్లకు మొత్తం 9,315 రూపాయల ఫైన్ పడింది. 15.02.2022 రోజు బిక్కనూర్ ఎంట్రీ... 15.04.2022 రోజు రామాయంపేట పరిధిలోని ధర్మార చెరువు ఎక్స్ రోడ్.. 15.06.2022 చేగుంట పరిధిలోని హంసా రెస్టారెంట్.. 11.08.2022 రోజున అల్వాల్ పరిధిలోని శామిర్ పేట టిఆర్పీఎస్ లిమిట్స్... 03.10.2022 చేగుంట పరిధిలోని వడియారం బైపాస్... 03.10.22 బిక్కనూరు పరిధిలోని బిక్కనూర్ ఎగ్జిట్.. 29.12.2022 మాచారెడ్డి పరిధిలోని లక్ష్మీరావుల పల్లి... 03.01.2023 రోజున రామాయంపేట పరిధిలోని ధర్మార చెరువు ఎక్స్ రోడ్... చిక్కడపల్లి పరిధిలోని అప్పర్ ట్యాంక్ బండ్ రోడ్ లో చలాన్లు ఉన్నాయి.
ఒక్కొక్క చలాన్ వెయ్యి రూపాయలతో పాటు ఛార్జీలు 35 రూపాయలు కలుపుకుని మొత్తం రూ. 9,315 రూపాయలు చలాన్లు చెల్లించాల్సి ఉంది. సాధారణ ప్రజలను ఒకలా, అధికారులను మరొకలా చూస్తున్నారని వారి వద్ద నుంచి చలాన్లు వసూలు చేయకపోవడంపై గతంలోనూ పలువురి విషయంలో సామాన్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్ వాహనంపై ఉన్న చలాన్లు అన్నీ కూడా ఓవర్ స్పీడ్ కు సంబంధించినవే. వేగం వద్దు.. ప్రాణం ముద్దు అని చెప్పే అధికారులు అతివేగంతో వెళ్తుండగా చలానా పడటం అధికారుల తీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
గతంలో కూడా కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనానికి ఇలాగే ఫైన్లు పెండింగులో ఉంటే పోలీసు శాఖ క్లియరెన్స్ చేయలేదని టెక్నీకల్ సమస్య వల్లనే చలాన్లు పెండింగులో కనిపించాయని అధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పుడు అదనపు కలెక్టర్ వాహనానికి కూడా అలాగే చలాన్లు పెండింగులో ఉన్నాయి. గత సంవత్సరం నుంచి తన వాహనానికి ఉన్న పెండింగ్ చలాన్లు చూసుకోకపోవడం గమనార్హం. ఈ పెండింగ్ చలాన్లపై ఇటు కలెక్టరేట్ అధికారులు, అటు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సామాన్యులకో న్యాయం, ఉన్నతాధికారులో న్యాయం అనే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.