Adilabad Rains : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలే పడలేదు. గత మే నెల చివరి వారంలోనే ఋతుపవనాలు వచ్చాయి. జూన్ మొదటి వారంలో కొద్దిపాటి వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షం జాడ కనిపించలేదు. నెల రోజుల తర్వాత మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈ సీజన్‌లో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు మొదలై నెల రోజులు అవుతున్న.. వానలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ నుంచే ప్రారంభం కావాల్సిన వానాకాలం సీజన్ వర్షాలు కురవకపోవడంతో నెల రోజులు ఆలస్యమైంది.
టైమ్‌కు వానల్లేకపోవడంతో సాగు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సీజన్ మొదలైందని కొందరు రైతులు పోయిన నెల మొదట్లో పడ్డ కొద్దిపాటి వర్షాలకు విత్తనాలు వేశారు. అయితే, గింజలు సరిగ్గా మొలవక, మొలిచినవి ఎండిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల రైతులు పత్తి విత్తనాలు రెండు సార్లు పెట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
ప్రస్తుతం మూడు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పత్తి సాగు చేస్తున్న వర్షాలతో తమ సాగుకు డోకా లేదని చెబుతున్నారు. అదే సమయంలో వరిసాగు కోసం రైతులు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు రోజులుగా ముసురుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఆదిలాబాద్‌కు సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెన్ గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జిల్లాలో పలు గ్రామాల్లో చిన్నపాటి వాగులు వంకలు, పొంగి లోలెవెల్ వంతెనలు నీటమునిగాయి.
నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్ట ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్నూరు మండలంలోని బారికరావుగూడ, ధన్నుగూడ, గాదిగూడ మండలంలోని మారుతిగూడ, కూనికాసా గ్రామాల సమీపంలోని వాగులు వరద నీటితో ఉప్పొంగాయి. దీంతో గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు తగ్గేవరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
బారికరావు గూడలో గిరిజనులు సాహాసంతో వాగు దాటే ప్రయత్నాలు చేశారు. గాదిగూడ మండలంలోని ఖడ్కి, లోకారి, దాబా, అర్జుని ప్రధాన రహదారిపై లోలెవెల్ కల్వర్టులపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోను ఆసిఫాబాద్ మండలంతో వాంకిడి, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికల్ పేట్, కౌటాల, కెరామెరి, దేహేగాం, సిర్పూర్, లింగాపూర్ మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో కుమ్రం భీం ఆడ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అధికారులు కుమ్రం భీం ఆడ ప్రాజెక్ట్ డ్యామ్ 2 గేట్లు ఎత్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
బెజ్జూర్ మండలం సోమిని, మెగవెలి, తలాయిలో ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా పంటలు నీట మునిగాయి. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లను దాటి పల్లెప్రకృతి వనం వరకు నదీ నీరు చేరింది. తలాయి, పాపన్ పేట్ మధ్య రెండు ఒర్రెలపై వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాంకిడి మండలంలో దుబ్బగూడ పరిధిలోని లోలేవల్ వంతెన పై నుండి వరద నీరు పొంగిపొర్లుతోంది. చింతలమానేపల్లి మండలం ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
మంచిర్యాల జిల్లాలో సైతం రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత, గోదావరి, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పుణ్య స్నానాలకు వెళ్లే ప్రజలకు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. జులై 1 నుంచి బుధవారం రాత్రి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 16 శాతం వర్షపాతం నమోదుకగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 శాతం అధికంగా నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 40 శాతం, నిర్మల్ జిల్లాలో 12 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.
కలెక్టర్లకు మంత్రి జూపల్లి ఆదేశం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ మేరకు మంత్రి జూపల్లి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తో ఫోన్ లో మాట్లాడారు. "జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. కుమ్రం భీం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేశారు. ఇదే సమయంలో వర్ష ప్రభావం వల్ల ప్రభావిత ప్రాంతాలు, ప్రత్యేకించి బెజ్జూరు, పెంచికల్ పేట్, దహేగాం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలి"అని కలెక్టర్‌ను ఆదేశించారు.
జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్.. మంత్రికి వివరించారు.