ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల పెద్దపులిని హతమార్చిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని ఎఫ్డీపీటీ శాంతారం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు. పెంచికల్ పేట్ మండలం అగర్ గూడ గ్రామ సమీపంలోని ఎల్లూరు అటవి ప్రాంతంలో పులిని చంపడం కలకలం రేపింది. ప్రభుత్వం, అటవీశాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి.
కాగజ్ నగర్ అటవీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెజ్జూరు అటవీ ప్రాంతంలో ఈ నెల 13న చివరగా తమ కెమెరాలకు కనిపించిన పులిని.. మే 14న పెంచికల్ పేట్ మండలంలోని ఎల్లూరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు కరెంట్ వైర్లు అమర్చి హతమార్చారని చెప్పారు. అనంతరం అక్కడ నుంచి 400 మీటర్ల దూరం తీసుకెళ్లి చర్మం, గోళ్లు, దవడలు తొలగించి కళేబరాన్ని పాతిపెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా 12 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
గతంలో వన్యప్రాణులను వేటాడిన చరిత్ర దహెగాం మండలంలోని చిన్నరాస్ పెల్లి గ్రామంలో ఒక అనుమానితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టగా.. దాచి పెట్టిన పులి గోళ్లు, దవడలు, చర్మం లభించాయి. వాటితోపాటు నిందితులు వినియోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు గతంలో వన్యప్రాణులను వేటాడిన చరిత్ర ఉందనీ, రిజర్వు ఫారెస్టులో తమ అనుమతి లేకుండా విద్యుత్తు తీగలు వేయడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ట్రాన్స్ కో అధికారులకు పలుమార్లు లేఖలు రాసినా తీగలను తొలగించడం లేదని పేర్కొన్నారు.
మృతి చెందిన పులి K8 గా అనుమానిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలను వెళ్లడిస్తామన్నారు. పులిని హతమార్చిన ఘటనలో ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్, పశువైద్యాధికారి రాకేశ్, వైల్డ్ లైఫ్ ఇన్స్పెక్టర్ జయప్రకాశ్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.