Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్ రైతులకు కష్టకాలంగా మారింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వారం రోజులుగా పంటలు నీటిలోనే మురుగుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. వరి, సోయా, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు వరదల ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. పెట్టిన పెట్టుబడి నష్టపోయి మరో పంట సాగుచేసే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


రికార్డుస్థాయిలో వర్షం


జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా జులై మొదటి, 2వ వారంలోనే అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గోదావరి, మంజీరా పొంగడంతో నందిపేట, నవీపేట, రేంజల్‌, బోధన్‌ మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. జిల్లాలో దాదాపు 59వేల 591 ఎకరాలకుపైగా పంట దెబ్బతిందని అధికారులు అంచనా వేశారు. ఇంకా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరినాట్లు వేసిన తర్వాతనే పంట నీట మునగడంతో వేసిన వరినారు మురిగిపోయి పంట దెబ్బతింది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 40వేల 811 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. 14006 ఎకరాల్లో సోయా పంటకు నష్టం జరిగింది. వీటితోపాటు 4,233 ఎకరాలకుపైగా మొక్కజొన్నకు నష్టం జరిగింది. పత్తి 292 ఎకరాల్లో పంట నష్టం జరిగనట్టు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 25 వేల 869 రైతులకు చెందిన పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. వేలాది ఎకరాల్లో నీళ్లు నిలిచి ఉండడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయ్. ఇది రైతులకు మోయలేని భారంగా మారింది. 


ఎలా బయటపడేది?


రైతులు పంటలు వేసేందుకు దున్నుడు, నాట్లు, ఎరువులు, విత్తనాల కోసం సుమారు 15 వేల నుంచి 20వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఎకరాకు ఇతర పంటలకు రూ. 20వేల వరకు పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా పడడంతో పంటలు వేసిన ప్రతీ రైతుపై అధిక భారం పడింది. వేసిన పంటలు దెబ్బతినడం, మళ్లీ వేసే పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల భారీగా నష్టపోవడంతోపాటు ప్రభుత్వం ఆదుకుంటే తప్ప బయటపడే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. ఈ వర్షాల వల్ల 470 ఇళ్లు పాక్షికంగా,13 ఇళ్లు పూర్తిగా నేల మట్టమయ్యాయ్. 19 గ్రామాల్లో వరద ప్రమాదం. 862 మంది నిరాశ్రయులయ్యారు. 16 చోట్ల నీటి కాలువలకు గండిపడింది.  జిల్లాలో 27 రోడ్లు కోతకు గురయ్యాయ్. 89 విద్యుత్ స్థంబాలు నేలమట్టమయ్యాయ్.


ప్రభుత్వానికి నివేదిక


జిల్లాలో వరుసగా వారం రోజుల నుంచి పడుతుండడంతో చెరువులు పొంగుతున్నాయి. జిల్లాలో 1067 చెరువులు ఉండగా వందశాతం చెరువులు నిండిపోయాయి. అన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. ఈ వర్షాలకు జిల్లాలో పలుచోట్ల చెరువులకు గండిపడింది. జిల్లాలో 32 చెరువులు దెబ్బతిన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లాలో వరుసగా వారం రోజుల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేనివిధంగా జిల్లాలో మొత్తం వర్షాకాలంలో పడే 75 శాతం వర్షం ఈ వారం రోజులోనే పడింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 287.9 మి.మీల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 752.9 మి.మీల వర్షం పడింది. జిల్లాలో వర్షాకాలంలో ప్రతీ సంవత్సరం సగటున 1042.4 మి.మీల వర్షం పడుతుంది. జిల్లాలో గురువారం భీంగల్‌ మండలంలో అత్యధికంగా 203.3 మి.మీల వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 71.5 మి.మీల నుంచి ఆపైనే పడింది. సగటు వర్షపాతం 124.1 మి.మీటర్లుగా నమోదైంది.