SRSP Record: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు చరిత్రలోనే జూలై రెండో వారంలోనే గేట్లను ఎత్తివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరద నీరు రావడంతో... అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 70 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు 36 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 76 టీఎంసీలు, 1087.9 అడుగులకు చేరింది. బుధవారం 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో , 4.57 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగింది.


గోదావరి నదిపై తెలంగాణలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసింది ఈ ఎస్సారెస్పీ ప్రాజెక్టునే. అయితే దీన్ని 1963ల నిర్మించారు. అప్పుడు దీన్ని నీటిని నిల్వ చేసి నీటి పారుదలకు మాత్రమే ఉపయోగపడే జలాశయంగా చూశారు. కానీ 1983 తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన కేంద్రంగా అభివృద్ధి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు నీటమిట్టం గరిష్ట ఎత్తు 1091 అడుగులు కాగా... నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపు అడుగులు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ, సరస్వతీ కాలువ, లక్ష్మీ కాలువ, వరద కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుంటుంది. 


అయితే ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టు ఎప్పుడూ ఆగస్టులో నిండుతూ వచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం జులై రెండో వారంలోనే భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నిండిపోయింది. ఇలా జరగడం ప్రాజెక్టు హిస్టరీలోనే మొదటి సారి. అయితే 2013లో జులై 25న, గతేడాది జులై 22న, ఈసారి జులై 10న గేట్లు ఎత్తారు. వాస్తవానికి పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు చేరువలోకి వచ్చాక గాని మిగులు జలాలను వదలరు. కానీ ఎగువ నుంచి వరద వస్తుండటంతో తొలిసారి ముందస్తుగా గేట్లు ఎత్తాల్సి వచ్చింది. 


ఏడాదిలో జిల్లా సగటు వర్షపాతం 1042 మి. మీ కాగా ఇప్పటి వరకు 752 మి.మీ పడింది. దాదాపు ముప్పావు వంతు కురిసింది. గతంలో ఎన్నడూ జులై రెండో వారంలో ఇంతలా వర్షపాతం నమోదు కాలేదు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చిన్నతరహా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. కౌలాస్ నాలా, సింగీతం, పోచారం, కల్యాణి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గేట్లు ఎత్తే ముందే తీర ప్రాంత ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.