Black Magic at Banswada in Kamareddy diistrict | బాన్సువాడ: టెక్నాలజీ ఎంత పెరిగినా.. మనిషి అంతరిక్షంలో నెలల తరబడి గడిపి క్షేమంగా భూమికి తిరిగొస్తున్నా మూఢనమ్మకాలు వీడటం లేదు. నిత్యం ఏదో ఓ చోట ధన రాశులు ఉన్నాయనో, లంకె బిందెలు దాచిపెట్టారంటూ తవ్వకాలు జరిపేవారు కొందరు. ఆకస్మిక ధనలాభం రావాలని, రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారాలని జంతు బలి, నర బలి ఇస్తే ప్రజలు కూడా ఇంకా ఉన్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇంట్లో ఉన్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
బాన్సువాడ గౌలిగూడలో గొల్ల రుక్కుం బాయి అనే మహిళ ఇంట్లో నుంచి కాలనీ వాసులకు కొన్ని రోజులుగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. మొదట ఇంటి పక్కన వాళ్లు ఏమైంది, రాత్రిపూట శబ్దాలు వస్తున్నాయని రుక్కుం బాయిని అడిగారు. ఇంట్లో రిపేర్ వర్క్ జరుగుతోందని, బాత్రూమ్ కోసం మట్టిని తవ్వుతున్నామని చెప్పారు. పక్క ఇంట్లో ఉన్న మహిళ మహేశ్వరి తనకు తెలియకుండానే కుక్కర్ విసిరి పడేసిందని పోలీసులకు చెప్పారు. పిల్లలను కొట్టడం గమనించిన ఇంటి ముందు ఉన్నవారు తనకు చెప్పడంతో అనుమానం ఇంకా పెరిగిందని పక్కింటి మహిళ మహేశ్వరి తెలిపింది.
రాత్రిపూట డోర్ తెరవాలంటే ఏం చూడాల్సి వస్తుందో, ఏం జరుగుతుందోనని మహేశ్వరి దంపతులు రాత్రిపూట బిక్కు బిక్కమంటూ గడిపారు. ఈ క్రమంలో ఇక లాభం లేదని స్థానికులకు విషయం చెప్పారు. కాలనీ వాసులు అంతా కలిసి ధైర్యం చేసి గొల్ల రుక్కుం బాయి ఇంట్లోకి వెళ్ళి చూసి షాకయ్యారు. ఇంట్లో పెద్ద గొయ్యి తవ్వి ఉంది. ఆ గుంతలో కుంకుమ, కొబ్బరి కాయలు, నిమ్మకాయలు కనిపించాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వారు అక్కడికి చేరుకున్నారు.
క్షుద్ర పూజల అని అనుమానంతో వారిని పట్టుకుని చితకబాదారు. ఇంటి యజమాని గొల్ల రుక్కుం బాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గత కొన్ని రోజుల నుంచి సుమారు 8 మంది శూద్ర పూజల్లో పాల్గొన్నట్లు కాలని వాసులు తెలిపారు. వీరు నారాయణఖేడ్ ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్ర ప్రాంత సరిహద్దు నుండి వచ్చినట్లు ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆ ఇంటిని పరిశీలించిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. వారు చెప్పే మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందని గమనించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్రపూజలు చేయడానికి కారణం ఏంటి, ఎంత మంది పూజలు చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు.