Kumram Bheem Asifabad :కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ పలు గ్రామాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. కౌటాల మండలంలోని ముత్తంపేట, పరిగాం గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేశారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్నారని తెలుసుకొని వారికి సంఘీభావంగా రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేపట్టారు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు.
ధర్నాలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్తున్నారని, ఇక్కడేమో మాయిశ్చర్, తప్ప, తాల అని తీవ్ర జాప్యం చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. అకాల వానల వలన రైతులు ఆందోళనకు గురవుతున్నారని వారిని, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ఇప్పటివరకు 3500 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ సివిల్ సప్లై అధికారి దీక్ష శిబిరాన్ని సందర్శించి వరి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు సివిల్ సప్లై కమిషనర్ చౌహన్‌తో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్ తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని హామీ ఇచ్చారు. వారితో స్థానిక ఎంపీడీఓ సత్యనారాయణ, ఎమ్మార్వో పుష్పలత, ఏఓ ప్రేమలత, గిరీషన్, భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షురాలు చనకపురే లావణ్య, మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, మాజీ ఎంపిటిసి దుర్గం మోతిరాం, ఒడ్డేటి నాని, కుంచాల సత్తయ్య, శివరాం, నర్సింగ్ రావు, బాలాజీ, సురేష్, శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.