Podu Lands In Telangana: పోడు భూముల పట్టా పంపిణి కార్యక్రమాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుంచే రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, బిసి కుల వృత్తుల ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్స్ లో సమీక్షించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. పోడు భూముల పట్టా పంపిణి కార్యక్రమాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల చొప్పున గృహలక్ష్మి పథకం క్రింద లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు
తెలంగాణ ప్రభుత్వం నుంచి గృహలక్ష్మి పథకం కింద 3 విడతల్లో లక్ష రూపాయల చొప్పున మొత్తం 3 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ధరణి లో నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్ డేట్ చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారం క్రింద, గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు అవసరమైన మేర ఉపాధి హామీ పథకం క్రింద పిట్టింగ్ పూర్తి చేయించాలని అన్నారు.
బీసి కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం క్రింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని అన్నారు. రెండవ దశ గొర్రెల పంపిణీ యూనిట్లపై లక్ష్యాలు నిర్దేశించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన బృందం ఆధ్వర్యంలో గొర్రెల కొనుగొలు చేయాలని అన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన గ్రామ పంచాయతీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.., నిర్దేశిత ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తీ చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ, జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రత్యేక మానిటరింగ్ చేయాలని, ప్రణాళిక ప్రకారం అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ధరణి లో నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్ డేట్ చేయాలని సూచించారు. రాబోయే హరితహారానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేసుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బీసి కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, పంచాయతి కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది దరఖాస్తుదారులు ఫీల్డ్ లెవల్ లో కుల వృత్తి చేస్తున్నారా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఆ వివరాలను పారదర్శకంగా ఆన్ లైన్ లో పొందుపరచాలని తెలిపారు. రెండవ విడత పంపిణీ చేసే గొర్రెల యూనిట్ లబ్దిదారుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ ఎం.నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, డిఆర్డిఓ పిడి కిషన్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial