Basara Latest News | బాసర: త్రిశక్తులు వెలసిన పవిత్ర బాసర పుణ్యక్షేత్రాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో శనివారం పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి, బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర చేరుకున్న మంత్రులకు త్రిబుల్ ఐటీ హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.

ఈవో ఆఫీసు ప్రారంభం..

అనంతరం బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆపై టిటిడి ఆధ్వర్యంలో రూ.9.30 కోట్ల వ్యయంతో మరమ్మత్తులు, నిర్మించిన 100 గదుల ధార్మిక వసతి గృహాలను మంత్రులు కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే రూ.3.48 కోట్లతో నిర్మించిన కార్యనిర్వాహణ అధికారి (ఈవో) కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. 

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా బాసర..

మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.., బాసర పుణ్యక్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని, భక్తుల అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, ఇతర వసతుల కోసం రూ.40 లక్షలు, అదనంగా రూ.1 కోటి మంజూరయ్యాయని పేర్కొన్నారు. వ్యాస మహర్షి తపస్సు చేసిన ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు బాసరకు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని వివరించారు.

ఈ యేడాది సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రానున్న కృష్ణా, గోదావరి పుష్కరాల కోసం పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు, భద్రతా ఏర్పాట్లకు నిధుల కేటాయింపుతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆలయానికి రెగ్యులర్ ఈఓ ను, అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్టు వెల్లడించారు. గోదావరి పుష్కర ఘాట్లలో ప్రమాదాలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

హామీలు అమలు చేస్తున్న ప్రభుత్వం  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. బాసర పుణ్యక్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతు భరోసా, సన్నబియ్యం,  నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. విద్యా రంగంలో పురోగతికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10వేల ప్రభుత్వ ఉపాధ్యాయులని నియమించామని వెల్లడించారు. కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగ భద్రత, మినిమమ్ వేజెస్ అందించేలా చర్యలు చేపడతామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

విద్య, ఉపాధి, వైద్య రంగాలకు అధిక నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. బాసర ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

బాసర ఆలయంలో అభివృద్ధి పనులు

ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. అమ్మవారి దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడం, శాస్త్రీయ వాస్తు ప్రమాణాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరగడం, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన క్యూలైన్ కాంప్లెక్స్, మరిన్ని వసతి గృహాలు నిర్మించడం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను విస్తరించడం ప్రణాళికలో భాగంగా ఉన్నాయని చెప్పారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పచ్చదనం పెంపొందింపు, పుష్కరిణి పునరుద్ధరణ, సౌర విద్యుత్ ఆధారిత విద్యుత్ వ్యవస్థ, సాంకేతికత వినియోగంతో సీసీ కెమెరాలు, డిజిటల్ డిస్ప్లేలు, ధార్మిక విద్య ప్రదర్శనలు వంటి ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.  ప్రజల అభిప్రాయాలు, పండితులు, పురోహితుల సూచనలతో సమన్వయం చేస్తూ ఈ అభివృద్ధిని సమగ్రంగా కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.   ఈ కార్యక్రమాలలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు బాసర ట్రిపుల్ ఐటీ నీ సందర్శించారు.  

బాసర ఐఐఐటి ని అభివృద్ధి చేస్తాం – మంత్రి కొండా సురేఖ

బాసర: నిర్మల్ జిల్లాలోని బాసరలో గల రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం ఆమె బాసర పర్యటన సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధిపై ఆర్జీయూకేటీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. బాసర ఐఐఐటీలో విద్యార్థులకు ఉత్తమ వసతులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యా విధానాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ఈ యూనివర్సిటీ ప్రతిష్ఠను పెంచుతున్నారని తెలిపారు. యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, బోధన, బోధనేతర అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. త్వరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ.3.20 లక్షల వ్యయంతో 'ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్' ప్రారంభం కానుందని పేర్కొన్నారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నాగేశ్, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్జీయూకేటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్‌డీ మురళీ దర్శన్, ఆర్డీఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.