సిర్పూర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ రావి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సస్పెండ్ చేశారు. ఇటీవల ఆయన మంత్రి సీతక్కపై, పార్టీ కార్యక్రమాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు రావి శ్రీనివాసును 6 ఏళ్లపాటు సస్పెండ్ చేశారు.  

సస్పెన్షన్ తో నాకు ఒరిగేది ఏమీ లేదుకాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారన్న విషయంపై రావి శ్రీనివాస్ స్పందించారు. సస్పెన్షన్ తో తనకు ఒరిగేది ఏమీ లేదన్నారు. తాను నిత్యం కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి తాను ఇచ్చే బహుమతిని స్వీకరించడానికి ఎదురు చూడాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తనను సస్పెన్షన్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై రావి శ్రీనివాస్ స్పందించారు. గత రెండు నెలల నుండి నన్ను సస్పెండ్ చేయాలని మంత్రి సీతక్క, పిసిసి అధ్యక్షులు, తెలంగాణ ఇంచార్జ్ వద్ద నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. కేవలం ఆమె అహంకారమే నేడు నా సస్పెన్షన్ కి నిదర్శనం. ఏరోజు నా స్వలాభం కోసం తనను ఏమీ అడగలేదన్నారు.

ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కార్యకర్తలకు ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోవాలని ప్రాధేయపడ్డ తప్పా 63,000 పైచిలుకు ఓట్లు సాధించిన ఆనాడు కోనేరు కోనప్ప నేను వద్దు అని.. 17 వేల ఓట్లు తెచ్చిన దండే విఠల్ ని వెంట వేసుకొని వర్గపోరులు సృష్టిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం తప్ప, నేను చేసిన తప్పేముంది. కార్యకర్త తల్లి చావు బతుకుల్లో ఉంటే, వారిని ఆదుకోండని అడిగా. నిమ్స్ ఆసుపత్రిలో ఒక బెడ్ కూడా ఇవ్వడానికి సహకరించలేదు. ఏంటని ప్రశ్నిస్తే కోపం పెంచుకుని నన్ను సస్పెండ్ చేశారు. ప్రజల కోసం పోరాడే నాయకుడిగా గుర్తించి ముఖ్యమంత్రి నాకు టికెట్ ఇచ్చారు. మీ సస్పెన్షన్ వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు. రానున్న ఎన్నికల్లో నేను ఇచ్చే బహుమతిని స్వీకరించడానికి ఎదురుచూడండి’ అన్నారు.