తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు ఆదివారం (జూన్ 4) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం నిర్మల్ జిల్లాకు రానుండగా.. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ను ఇప్పటికే సిద్ధం చేశారు. సీఎం ప్రారంభించనున్న భవనాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. నిర్మల్ పట్టణం జెండాలు, తోరణాలు, ఆర్చీలతో గులాబీమయం అయింది. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. డివైడర్లను ఆకర్షణీయమైన పెయింటింగ్, పూల మొక్కలతో అందంగా అలంకరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భారీ జనసమీకరణపై దృష్టి పెట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.