రాష్ట్ర సంపాదనను బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని, బిఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో నెరవేరని నీళ్లు, నిధులు, నియామకాల, తెలంగాణ లక్ష్యాలు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రెండు పడకల ఇండ్లు పేదలకు ఇచ్చుడు దేవుడేరుగు.. ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మాయం చేశారు అంటూ సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాథ్ సే హథ్ జోడ్ పిపుల్స్ మార్చ్ పాదయాత్ర కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బూరుగూడ నుంచి మోతుగూడ వరకు కొనసాగింది. మోతుగూడ కార్నర్ మీటర్ల లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు.


బిఆర్ఎస్ పాలనలో రేషన్ షాపులు బియ్యం దుకాణాలుగా మారిపోయాయి. ధనిక రాష్ట్రంలో 9 సరుకులకు 18 సరుకులు ఇవ్వాల్సిన ప్రభుత్వం అమ్మ హస్తముకు మంగళం పాడిందని సెటైర్లు వేశారు. టీఎస్ పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ చేసిన ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు భట్టి విక్రమార్క. నిరుద్యోగులారా గొంతు ఎత్తి అరవండి, మీ ఆశలు, హక్కులను కాల రాసిన బిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
ప్లాట్లు ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు సాయం
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి స్థలాలు లేనివారికి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు భట్టి. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి అమ్మ హస్తం పథకం తీసుకొచ్చి తొమ్మిది సరుకులు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం చేస్తాం. ఏడో తరగతి విద్యార్థి చైతన్య తన వద్దకు వచ్చి తమ పాఠశాలలో టాయిలెట్స్ లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు చెప్పినప్పుడు చాలా ఆవేదన గురయ్యానని తెలిపారు. చైతన్య మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను ఎదుర్కొంటున్న ఈ సమస్య పైన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులను దళిత గిరిజనుల, అభివృద్ధికి ఖర్చు చేస్తాం అన్నారు. రానున్న 2023 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తుందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.


డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదాని!: రేవంత్ రెడ్డి
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని... బ్రిటీష్ జనతా పార్టీ అని టీసీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే డబుల్ ఇంజిన్ అంటే ఒకటి ప్రధాని మోదీ అని మరొక ఇంజిన్ అదానీ అని ఎద్దేవా చేశారు. అదానీ ఇంజిన్ కు రిపేర్ వచ్చిందని.. అందుకే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విభజించు-పాలించు అనే విధానాన్ని అవలంభిస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ను వల్లభ భాయ్ పటేల్ నిషేధించారని గుర్తుచేశారు. దేశ సంపదను అదానీ సంస్థ కొల్లగొడుతోందని విమర్శించారు. అదానీ పోర్టు నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన సంకల్స సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీపై మండిపడ్డారు.