Nirmal News: వారం రోజుల పాటు నిరనసలతో హీటెక్కిన నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్శిటిలో పాఠాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలపై వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు నిన్నటి(మంగళవారం)తో ముగిశాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. తరగతులు ప్రారంభమయ్యాయ్.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏడు రోజులపాటు విడతల వారీగా ఆందోళన బాట పట్టారు. ట్రిపుల్ ఐటీకి వైస్ఛాన్సలర్ నియామకం, విద్యార్థుల నిష్పత్తికి ఆధారంగా అధ్యాపకుల భర్తీ, వసతి, తరగతుల్లో మౌలిక సదుపాయాలు, లాప్ టాప్, యూనిఫామ్, బెడ్లు అందించాలని నిరసన చేపట్టారు. ఏడు రోజులపాటు ఎండనకా... వాననకా 24 గంటలపాటు విడతలవారీగా దీక్షలు చేశారు. విద్యార్థుల నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపడానికి జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, యూనివర్సిటీ అధికారులు పలుమార్లు చర్చలు జరిపిన. విద్యార్థులు తమకు హామీలు కాకుండా కాల పరిమితితో కూడిన హామీ కోసం పట్టుబట్టారు. మంత్రి అల్లోల ఇంద్రకరణెడ్డి, ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, కలెక్టర్ ఉన్నత విద్యాశాఖ మండలి వైస్ చైర్మన్ వెంకట రమణతో చర్చలు జరిపినప్పటికీ తగిన హామీ లభించలేదు. చివరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల డిమాండ్లకు విడతల వారిగా తీర్చుతామని చెప్పటంతో నిరసనలకు పుల్ స్టాప్ పడింది.
ట్రిపుల్ ఐటీలో నెలకొన్న ప్రశాంతత...
ట్రిపుల్ ఐటీ యూనివర్సీటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలో గతంలో కాకుండా ఈసారి విద్యార్థులు చేసిన ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీ, విద్యార్థి సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దీనికి తోడు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సైతం యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విడతల వారిగా ట్రిపుల్ ఐటీలో పనులు ప్రారంభించారు. మొదటగా మరుగుదొడ్లలో ప్లంబింగ్ పనులు ప్రారంభించారు. పనులను వేగవంతం చేశారు. దీంతో విద్యార్థులు సైతం తరగతి గదుల్లో చదువులతో బిజీగా మారారు. మొత్తానికి బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణం ఏడు రోజులు నిరసనలతో హోరెత్తి ప్రస్తుతం ప్రశాంత వాతవరణంలోకి వెళ్లింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి హామీకి నిర్ధిష్ట సమయం
వారం రోజుల్లో ఛాన్స్ లర్ నియామక ప్రక్రియ, 45 రోజుల్లో వీసీ నియామకం.
ప్రొఫెసర్ల నియామకాలు, మిగిలిన విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్‌తో కలిపి ఖాళీల భర్తీ చేయనున్నారు.
లాప్‌ట్యాప్‌ల పంపిణీ, మూడు నాలుగు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు.
వెయ్యి 50 పడకలు, పరుపులు, వెంటనే 650 పడకలు సిద్ధం. త్వరలో మిగిలినవి సమకూర్చేలా నిర్ణయం.
ఇతర మౌలిక వసతులు, రూ 5.6 కోట్లు వెంటనే మంజూరు, డైరెక్టర్ కు చెక్ పవర్.
ప్లంబింగ్, విద్యూదీకరణ, ప్రతి సమస్యకు అక్టోబర్ 31 లోగా పరిష్కారం