Mancherial Crime News: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఆదివాసి పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగే వరకు వెళ్లింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన సుమారు 50 మంది ఆదివాసి పోడు రైతులు తమ భూ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు బుధవారం లక్షెట్టిపేట అటవీ శాఖ రేంజి కార్యాలయానికి వచ్చారు. వారిలో 27 మందిపై గతంలో అరెస్టు వారెంట్ జారీ అయి ఉండటంతో అటవీ అధికారులు వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించేందుకు యత్నించారు.
వినతి పత్రం ఇచ్చేందుకు ఆఫీస్‌కు వచ్చిన వారిని అరెస్టుకు యత్నించడం వివాదానికి కారణమైంది. ఈ క్రమంలో అక్కడున్న ఆదివాసి పోడు రైతులు, ఆదివాసి మహిళలంతా అటవీ శాఖ అధికారులపై తిరగబడ్దారు. కేసులున్న వారంతా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. వారిని లక్షెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తాలో అదుపులోకి తీసుకునేందుకు అధికారులు యత్నించారు.
అయినప్పటికీ వారిని ఆదివాసీలు అటవీ అధికారుల వాహనాలకు అడ్డుపడటంతో జాతీయ రహదారిపై అటవీ అధికారులు, పోడు రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువురు పరస్పర దాడులకు పాల్పడ్డారు. హోరాహోరీగా పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది.
ఈ ఘర్షణలో ఆరుగురు పోడు రైతులతో పాటు మరో ఆరుగురు అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారు. వారిని అటవీ శాఖ అధికారులు లక్షెట్టిపేట, మరికొందరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసులు ఉన్న పోడు రైతులను అరెస్టు చేయడానికి యత్నించగా.. ఆదివాసులు తమ సిబ్బందిని గాయపరిచి పారిపోయినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ వెల్లడించారు. సమస్య పరిష్కారం కోసం వస్తే అరెస్టులకు పాల్పడతారా అంటూ ఆదివాసీలు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.