Tarnam Bridge Diversion road in Adilabad | ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి వద్ద గత రెండు నెలల కిందట భారీ వర్షాల కారణంగా అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో తర్ణం బ్రిడ్జి నుంచీ జైనథ్, బేల, మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న ప్రయాణికులు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.


ఈ విషయమై ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ జాతీయ రహదారి అధికారులతో ప్రతిపాదనలు పంపారు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం తర్నం బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శనివారం అధికారులు, ఇంజనీర్లతో కలిసి తర్ణం బ్రిడ్జి సమీప పరిసర ప్రాంతాలను పరిశీలించారు.


త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం


తర్ణం బ్రిడ్జి వద్ద పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వీలైతే రాత్రి  పగలు కష్టపడి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా బ్రిడ్జి సమీపంలోని రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత డైవర్షన్ నిర్మాణం పనులను పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం లాండా సాంగ్వి, ఆడ, అర్లీ మీదుగా వాహనాలు ప్రయాణించడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. మరో ఆరు నెలల్లో ప్రస్తుతం కుంగిపోయిన బ్రిడ్జిని కూలగొట్టేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శ్రీకారం చుడతామన్నారు. 


Also Read: Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?