Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
BRS MLC Kavitha | రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.

Revanth Reddys roots are in RSS | నిజామాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందువల్లే మైనారిటీలపై ఆయన వివక్ష చూపుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత సైతం మైనారిటీ ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేసినా వారిని పట్టి్ంచుకోవడం లేదని విమర్శించారు. మైనారిటీల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మత కల్లోలాలు జరగలేదు
నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ, సీఎంగా కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పలుచోట్ల మతకల్లోలాలు జరిగాయి. వీటిని నిరోధించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? గంగా జమునా తెహజీబ్ లా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చుపెడుతోంది కాంగ్రెస్. మైనారిటీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ విస్మరించింది.
చెవేళ్ల డిక్లరేషన్ ఏమైంది..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. మైనారిటీ డిక్లరేషన్ అమలు చేస్తామని ప్రకటించి, ఓట్లు పడ్డాక మైనార్టీలను కాంగ్రెస్ పక్కనపెట్టింది. ఏడాది పూర్తయినా మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైంది ? మైనారిటీ డిక్లరేషన్ (Minority Declaration) ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్‌లో మైనారిటీలకు కేటాయించిన మొత్తంలో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదు. 3 వేల కోట్లు కేటాయించినా కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చింది. వారి పాలన ఏడాది పూర్తయినా కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు ఏ గ్యారంటీ లేదు. బీఆర్ఎస్ హయాంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద లక్షకు పైగా ఆర్థిక సాయం అందుతుండేది. కాంగ్రెస్ ను గెలిపిస్తే తులం బంగారం, లక్ష రూపాయాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. షాదీ ముబాకరక్ కింద పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డల కుటుంబాలకు తులం బంగారం లేదు, లక్ష రూపాయలు ఇవ్వకుండా పెండింగ్ లో పెడుతున్నారు. నిజామాబాద్ లో తబ్లిఖీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలి. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Also Read: Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన