నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం పనులు భూసేకరణ తర్వాతనే చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. రైతుల నుంచి నిరసనలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అప్పటి వరకు మంచిప్ప వద్ద చేపట్టిన గడ్కొల్ పంప్‌హౌజ్ పనుల నిర్మాణం కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
వానాకాలం ప్రారంభమై రైతులు పంటలు వేస్తున్నందున 21 ప్యాకేజీ కింద ఆయకట్టుకు నీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. జులై మొదటి లేదా రెండో వారంలో సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి వద్ద ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. అవసరాల మేరకు నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గం పరిధిలో నిర్ణయించిన ఆయకట్టుకు పైప్‌లైన్‌ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. మోపాల్ మండలం మంచిప్ప వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ పనులను భూసేకరణ తర్వాతనే చేపట్టనున్నారు. ఈ రిజర్వాయర్ ఎత్తును 3.5 టీఎంసీలకు పెంచడం వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది. ఆ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 1400 ఎకరాల వరకు భూములు, ఇళ్లను కోల్పోతుండడంతో వారు నిరసనలకు దిగారు. తమ భూములను ఇవ్వమని ప్రకటించారు.
గత నెలలో పలు దఫాలు గడ్కొల్ పంప్‌హౌజ్ నిర్మాణ పనులు అడ్డుకున్నారు. మంచిప్ప వద్ద ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులను కలుస్తూ... వినతిపత్రాలు ఇచ్చారు. జిల్లా అధికారులకు పనులు చేపట్టవద్దని విజ్ఞప్తులను చేశారు. నిరసనలు పెరుగుతుండడంతో గడ్కొల్ పంప్‌హౌజ్ నిర్మాణ పనులు నిలిపివేశారు. రిజర్వాయర్ పనులు కూడా వాయిదా వేశారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో పలు దఫాలుగా చర్చించేందుకు నిర్ణయించారు. మంత్రుల సమక్షంలో సమావేశాలు జరిపి వారి నిర్ణయం ఆధారంగానే భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కావాల్సిన పరిహారాన్ని అందించడంతోపాటు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. వచ్చే నెలలోగాని ఆ తర్వాతగాని నిర్ణయం తీసుకుని పనులను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గడ్కొల్ పంప్‌హౌజ్ నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేశారు.
మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం కాకున్నా ప్రస్తుతం ఉన్న 21 ప్యాకేజీ కింద ఆయకట్టుకు నీళ్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ చేపట్టేందుకు నిర్ణయించారు. నవీపేట మండలం బినోల నుంచి నీటిని సారంగాపూర్ పంప్‌హౌజ్‌కు మళ్లించనున్నారు. సారంగాపూర్ పంప్‌హౌజ్ నుంచి నీటిని నిజాంసాగర్ కాల్వలోకి ఎత్తిపోయనున్నారు. ఈ కాల్వ ద్వారా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి వరకు నీటిని తరలిస్తారు. అక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా పంట పొలాలకు మరలిస్తారు. ఈ రెండు చోట్ల పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తవడంతో జూలై మొదటి లేదా రెండో వారంలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు మొదలై వరద పెరగ‌్గానే ఎక్కువ మొత్తంలో పైప్‌లైన్‌ల ద్వారా సాగుకు ఇచ్చేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.