G0 49 Tiger Zone In Asifabad | కాగజ్‌నగర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో 49 ను శాశ్వతంగా రద్దు చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా పాల్వాయి హరీష్ బాబు (Palvai Harish Babu) డిమాండ్ చేశారు. జీవో 49 రద్దు చేసి, , ప్రజల భూ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం (ఆగస్టు 18న) కాగజ్ నగర్ అటవీశాఖ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే హరీష్ బాబు తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.

కాగజ్‌నగర్ ఫారెస్ట్ ఆఫీసు ముట్టడికి పిలుపుఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ జారీ చేసిన జీవో నెం.49 ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం విరమించేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని దిందా పోడు రైతులతో పాటు వివిధ మండలాలలోని పోడు రైతులకు సంఘీభావంగా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయాన్ని వేలాది మంది పోడు రైతులు, ఫారెస్ట్ అధికారుల బాధితుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ముట్టడిస్తామని సిర్పూర్ శాసనసభ్యుడు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. 

ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం వలన సమస్య జటిలమైందే.. తప్పించి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిద్దాం అనే ఆలోచనే ఫారెస్ట్ అధికారులకు లేకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ దండే విఠల్ ఫారెస్ట్ అధికార్లకు వత్తాసు పలుకుతూ బీసీలకు పోడు భూములపై హక్కు లేదనడం అన్యాయం అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు.

కేసీఆర్ హయాం కంటే ఎక్కువ నిర్బంధాలు..దిందా పోడు రైతులు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే వారిని దారుణంగా హింసించి తిరిగి దిందాలో వదిలిపెట్టారని అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన నిర్బంధకాండ కన్నా ఎక్కువగా నిర్బంధం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతుందని విమర్శించారు. రేపటి కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయం ముట్టడికి పోడు రైతులు, ఆదివాసి సంఘాలు, అఖిల పక్షాల నాయకులు, ఫారెస్ట్ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలెం వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, మాజీ కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్, రాపర్తి ధనుంజయ్, సుధాకర్, వెంకన్న, సాయి, భుజంగరావు, తిరుపతి, సదానందం, సత్యనారాయణ, సంతోష్, బాపూజీ తదితరులు పాల్గొన్నారు.