తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ‌ లిక్కర్ స్కాంలో త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదని బీజేపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే వరకు తన పోరాటం ఆగదన్నారు. మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసి తనపై అసత్య ప్రచారం చేశారని.. ‘శ్రీవారి సాక్షిగా చెబుతున్నా.. నేను ఎవరికీ అమ్ముడుపోలేదు. అవినీతి చేసి ఉంటే నిరూపించాలంటూ’ కేటీఆర్, రేవంత్ రెడ్డిలకు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఉదయం తిరుమల స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 


తిరుమల శ్రీవారి దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానన్నారు.  కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అన్నదమ్ములుగా కలిసి‌ ఉండి తెలుగు వారి గొప్పదనం దేశంకు చాటి చెప్పేలా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టిపై తెలంగాణ ప్రజల వ్యతిరేకత ఉందనేది మునుగోడు ఎన్నికల్లోనే కేసీఆర్ కి తెలిసిందన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక కౌరవ సైన్యం వచ్చి ప్రతి గ్రామానికి ఒక మంత్రి, అధికారి‌ వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిన విషయం కేసీఆర్ కు పూర్తి అర్ధం అయ్యిందని, ప్రజల ఆలోచనలను డైవర్షన్ చేసేందుకు, టీఆర్ఎస్ పార్టీపై వెళ్తే ప్రజలు ఓటు చేసే పరిస్ధితి లేదన్నారు.


టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ స్థాయిలో కొత్త డ్రామాకు కేసీఆర్ తెర తీశారని ఆయన విమర్శించారు. నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తున్నట్లు కేసీఆర్ నాటకం ఆడి ప్రజల ఆలోచనలను డైవర్షన్ చేశారో అందరికి తెలుసునని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, ఒక కుటుంబ పాలన, నియంత పాలన కొనసాగుతుందన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ప్రజలకు, పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. అందులో భాగంగానే తాను కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేసి బీజేపీ నాయకత్వంలోనే తెలంగాణలో ప్రజాస్వామ్యంను కాపాడవచ్చని నిర్ణయం తీసుకుని కేసీఆర్ కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నే కాకుండా యావత్తూ తెలుగు ప్రజలంతా నైతికంగా రాజగోపాల్ రెడ్డి, బీజేపీ గెలిచిందని సంతోషపడ్డారని చెప్పారు. పది వేల ఓట్లతో కేసీఆర్ గెలిసినా సంతోషం లేదన్నారు. 
రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం రక్షణ కోసం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం బీజేపి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో‌ నూటికి నూరు శాతం తెలంగాణలో బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నిజమైన అమరవీరులకు నిజమైన నివాళి అందించాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నారు. తన జీవితంలో డబ్బు కోసం ఎప్పుడూ పాకులాడలేదని,  రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక‌ తనపై‌ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకెళ్లటం ఖాయం...
తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి. కవిత పై కేసులు నమోదు కావడంతో సీఎం కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలు బాగు పడలేదని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్స్ సాధన కోసం నిజామాబాద్ నగరంలో బీజేపీ పోరుబాట చేపట్టింది. నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహా ధర్నా లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని మండిపడ్డారుకొండా విశ్వేశ్వర్ రెడ్డి. 
ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం 43లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చారని మన తెలంగాణ రాష్ట్రంలో 40 వేలు కూడా నిర్మించలేదని చెప్పారు. కేసీఆర్ ను బొంద పెట్టె సత్తా  కేవలం బీజేపీకే ఉందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వకుంటే తామే పేదలకు ఆ ఇళ్లను పంచుతామని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. గ్యాస్ సిలిండర్ పై కేంద్రం 5 శాతం పన్ను విధిస్తే.... రాష్ట్ర ప్రభ్యత్వం 55 శాతం పన్ను విధిస్తోందన్నారు.