Basara IIIT students Protest | బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ (Basara IIIT VC) నియమించాలంటూ రెండు రోజుల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే తమ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 


అస్తవ్యస్తంగా తయారైన క్యాంపస్
రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్ లేకపోవడంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేక దృష్టి పెట్టి తమ సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ వీసీతో పాటు, ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలంటూ విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు శుక్రవారం (సెప్టెంబర్ 6న) బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారాన్ని ముట్టడించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు ఏబీవీపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఏబీవీపీ నాయకులు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వారికి మద్దతుగా వచ్చారు. కానీ ట్రిపుల్ ఐటి సెక్యూరిటీ సిబ్బంది, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరగడంతో కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. 


రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు


గత రెండు రోజులుగా విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అంటున్నారు. వెంటనే రెగ్యులర్ వీసీని నియమించడంతో పాటు ఎప్పటినుంచో ఉన్న విద్యార్థుల 17 డిమాండ్లను పరిష్కరించాలని ట్రిపుల్ ఐటి విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే, డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.


Also Read: Flood Relief: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం - రూ.3,300 కోట్లు విడుదల, వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్