Basara IIIT Student Suicide | బాసర: నిత్యం వివాదాలకు కేంద్రంగా నిలిచే నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్. వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థిని వసంత బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలు వసంత స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది వనపర్తిలోని విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వసంత ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ప్రేమ విషయమే కారణమా..
వసంత ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడం కారణమని వైరల్ అవుతోంది. ఆమె గణేష్ అనే యువకుడ్ని ప్రేమిస్తోందని, ఆ యువకుడు తన స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. అంతకుముందు తన ఫోన్, వాట్సాప్ లో వసంత నెంబర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వసంత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చెబుతున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకు రానున్నాయి.