ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మొన్న జరిగిన విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే ఈ రోజు పీయూసీ - 1 విద్యార్థి జాదవ్ బబ్లూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. వెంటనే సిబ్బంది భైంసాలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చారు. ఇక అక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ చదువుతున్న విద్యార్థిని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన బబ్లూ అని గుర్తించారు. నిర్మల్ ఆసుపత్రికి తరలించాక స్థానిక రాజకీయ నేతలను, ఇతర నాయకులను ఎవరినీ లోనికి రానీయకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


హైదరాబాద్ ఐఐటీలోనూ విద్యార్థిని సూసైడ్


ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్‌ లెటర్‌ రాసి హాస్టల్‌ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్ధిని మమైత నాయక్(21) ఎంటెక్‌ చదువుతుంది. మంగళవారం హాస్టల్‌లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపింపించింది.


ఒరియా భాషలో తన చావుకు ఎవరూ కాదని, చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నట్లు సూసైడ్‌ లెటర్‌ రాసి బలవణ్మరణానికి పాల్పడింది. హాస్టల్‌ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సూసైడ్‌ లెటర్‌ స్వాధీనం చేసుకున్నారు. విద్యార్ధిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ .. మమైత ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రెండు వారాల క్రితమే విద్యార్థి క్యాంపస్‌లో చేరిందని, జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 


పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చదువులో ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నానని మమైతా సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 


ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. తాజాగా మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడటంతో.. విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 2022-23 ఏడాది వ్యవధిలోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చదువులు చదవలేక, ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, చిన్న సమస్యలకే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.


ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఇవే..


హైదరాబాద్ ఐఐటీలో ఆత్మహత్యలు ఆగడం లేదు. దాదాపు ఏడాదిలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 31న ఏపీ నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థి రాహుల్ మంచానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ హోటల్‌పై నుంచి కిందికి దూకి బలన్మరణానికి పాల్పడ్డాడు. జులై 17వ తేదీన క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ వైజాగ్‌లో శవమై తేలాడు. మంగళవారం ఒడిశాకు చెందిన మమైతా నాయక్ క్యాంపస్‌ హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.