తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ తెరిపిస్తామని, ఈ కేసుతో సీఎం కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి సంబంధం ఉందని నిర్మల్ లో బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అదే విధంగా  హైదరాబాద్ డ్రగ్స్ కేసును కూడా బయటకు తీసి, దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. త్వరలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని తెలంగాణ మంత్రుల అవినీతి చిట్టా బయట పెడతామన్నారు. 


మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి చిట్టా మొత్తం తమ వద్ద సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్. మీడియా ముందుకు వచ్చి బీజేపీ నేతలపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాటతీస్తాం అన్నారు. మున్సిపల్ స్కామ్ లో మీరు తిన్నదంతా కక్కిస్తామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక జైలుకు వెళ్లడం ఖాయమని ఇంద్రకరణ్ రెడ్డిని హెచ్చరించారు. మంత్రికి సహకరించిన కలెక్టర్ జాగ్రత్త, మేం అధికారంలోకి వచ్చాక మీ భరతం పడతామని కనకాపూర్ రోడ్ షోలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


న‌ల‌బై ఏళ్ళుగా రాజ‌కీయాల్లో ఉన్నామ‌ని, ఏనాడు వ్యక్తిగ‌త దూష‌ణ‌కు దిగ‌లేదని, కానీ బ బీజేపీ నేత‌లు  నోటికి ఎంత వ‌స్తే అంత మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. సోమ‌వారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనకు చేసిన ఛాలెంజ్‌కు  రెడీ అన్నారు. 10 రోజులు టైమ్ ఇస్తానని, తన చిట్టా ఏంటో బయటపెట్టాలని బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని తాను సైతం బండి సంజయ్‌కి సవాల్ చేస్తున్నానని చెప్పారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకపోతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు బీజేపీగానీ, బండి సంజయ్ గానీ ఇన్ని రోజులు ఏం చేశారో చెప్పాలని ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ సభలు, సమావేశాలు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయంటూ మంత్రి మండిపడ్డారు.


‘విమ‌ర్శలకు కూడా ఓ హ‌ద్దు ఉంటుంది. ఇనేళ్ళ రాజ‌కీయ జీవితంలో ఏనాడు వ్యక్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు రాజ‌కీయ విమ‌ర్శలు చేసుకోవ‌డం కామ‌న్. కానీ గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా గౌర‌వ ముఖ్య‌మంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మ‌హిళ‌లు, చిన్న పెద్ద, అనే తేడా లేకుండా బీజేపీ నేత‌లు నోటికి ఎంత వ‌స్తే అంత మాట్లాడుతున్నారు. నిన్న జ‌రిగిన  నిర్మల్ స‌భ‌లో   గౌర‌వ సీయం,   గౌర‌వ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వారిలా మేము తిట్టద‌లుచుకోలేదు, మాకు సంస్కారం ఉంది. అభివృద్ధి పై విమ‌ర్శలు చేయండి , ఫ‌లానా వ్యక్తి ప్రభుత్వ ప‌థ‌కాలు రాలేద‌ని చూపించండి త‌ప్పులేదు. కానీ వ్యక్తిగ‌త దూష‌ణ‌లు అది కూడా అన్ పార్లమెంట‌రీ మాట‌లు మాట్లాడ‌టం వారి దిగ‌జారుడుత‌నానికి ప‌రాకాష్ట. 
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో  ప్రజ‌ల‌కు తెలుసు. తెలంగాణ‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా?. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలంగాణ‌కు  ఏం చేశారో చెప్పాలి?. గడిచిన 8 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపించ లేదా?. ప్రజా సంగ్రామ యాత్రలో బూతు పురాణం త‌ప్ప ప్రజ‌ల‌కు ప‌నికి వ‌చ్చేది ఒక్క విష‌యం అయినా మాట్లాడారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు,  నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేస్తారో చెప్పారా బీజేపీ నేత‌లు స్టేట్‌మెంట్లకే పరిమితం అయ్యారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క హామీనైనా ఇచ్చారా’ అని ప్రశ్నించారు.