కాగజ్‌నగర్: రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి అధ్వాన్నంగా ఉందని.. నాణ్యత లేకుండా పనులు చేయడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా చేసేందుకు ఈ మేరకు నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని బండి సంజయ్ కోరారు. 

పలు రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు నితిన్ గడ్కరీ శ్రీకారం     కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో రూ.6100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు రహదారులకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ఎంపీలు వంశీ, గొడం నగేశ్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

26 ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, కొన్ని జాతికి అంకితం..

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో మరిన్ని రోడ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. దాదాపు  6 వేల 100 కోట్ల రూపాయలతో 167  కి.మీ. మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనుల కార్యక్రమాలను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఒకప్పుడు వెనుకబడిన జిల్లా. రోడ్లు, రహదారుల వ్యవస్థ ఘోరంగా ఉండేది. ఈరోజు ఉదయం కరీంనగర్ నుండి ఇక్కడికి గంటన్నరలోపే వచ్చాను. తెలంగాణలో ఎక్కడికైనా సరే... పొద్దున్నే పోయి పని చూసుకుని మళ్లీ సాయంత్రానికి ఇంటికి రాగలుగుతున్నాం... దీనికి కారణం ఆలోచిస్తే.. ఒక్కసారి పదేళ్ల క్రితానికి, ఇప్పటికీ ఉన్న తేడాను గుర్తు చేసుకోవాలి. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు. గత పాలకులు వెనుకబడేసిన జిల్లా. మోదీ ప్రభుత్వం వచ్చాక శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 

రాష్ట్రంలో రహదారులు రెట్టింపు చేశాం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికే జాతీయ రహదారుల(నేషనల్ హైవేస్) అభివృద్ధి కోసం ఏకంగా 1 లక్షా 25 వేల 485 కోట్ల  రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణపట్ల మోదీకి, గడ్కరీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఏం కావాలి? మోదీ ప్రధాని కాకముందు అంటే 1947 నుండి 2014 వరకు (గత 67 ఏళ్లలో) 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. కానీ మోదీ పాలనలో గడ్కరీ చొరవతో గత పదేళ్లలో 5200 కిలోమీటర్లకు రహదారులు పెరిగాయి. అంటే రెట్టింపు స్థాయిలో జాతీయ రహదారులు విస్తరించాయి. అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టుల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోందంటే మౌలిక సదుపాయల కల్పనవల్లే సాధ్యమైందని బండి సంజయ్ అన్నారు.

కోమటిరెడ్డి భోళా మనిషి

గడ్కరీ వద్దకు ఏ ప్రతిపాదన తీసుకెళ్లినా కాదు, లేదు అనుకుండా పనులు చేసి పంపిస్తారు. బీజేపీకే కాదు ఏ మంత్రి, ఎంపీ వెళ్లినా పనులు చేస్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. కోమటిరెడ్డి భోళా మనిషి. మనసులో ఉన్నది ఉన్నట్లు చెబుతారు. పనులు చేయించుకుని వస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ పలుమార్లు మాట చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు. తరువాత అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యమన్నారు. భారతమాతను విశ్వగురుగా తీర్చిదిద్ది 2047 నాటికి దేశాన్ని నెంబర్ వన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 

హైదరాబాద్ నుండి మంచిర్యాల రోడ్డు వరకు రాజీవ్ రహదారి  బాగోలేదు. క్వాలిటీ లేకుండా పనులు చేశారు. దయచేసి ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడండి. ఆ సమస్యను పరిష్కరిస్తే రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. ఈ విషయంలో కోమటిరెడ్డి చొరవ తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.